Begin typing your search above and press return to search.

జ‌యంతి సీబీఐకి చిక్కిన‌ట్టేనా!

By:  Tupaki Desk   |   11 Sep 2017 5:23 AM GMT
జ‌యంతి సీబీఐకి చిక్కిన‌ట్టేనా!
X
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు కేంద్రంలో పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన వారిపై ఏక‌బిగిన వ‌రుస దాడులు జ‌రుగుతున్న మాట ఏ ఒక్క‌రూ కాద‌న‌లేనిదే. మోదీ స‌ర్కారు ముందు ప‌దేళ్ల పాటు దేశాన్ని పాలించిన మ‌న్మోహ‌న్ సింగ్ కేబినెట్ లో కీల‌క మంత్రులుగా కొన‌సాగిన ప‌లువురు నేత‌ల ఇళ్లు - వ్యాపారాల‌పై ద‌ర్యాప్తు సంస్థ‌లు వ‌రుస సోదాలు జ‌రుపుతున్నాయి. ఈ త‌ర‌హా దాడుల్లో ప్ర‌త్యేకించి త‌మిళ‌నాట జ‌రుగుతున్న దాడులు నిజంగానే ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

మ‌న్మోహ‌న్ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పి.చిదంబరాన్ని టార్గెట్ చేసిన మోదీ స‌ర్కారు.. చిద్దూ స‌తీమ‌ణి నళినితో పాటు ఆయ‌న కుమారుడు కార్తీ చిదంబ‌రంపై ముప్పేట దాడులు చేయించింద‌నే చెప్పాలి. న‌ళిని విష‌యంలో కాస్తంత దూకుడు త‌గ్గినా... కార్తీపై మాత్రం ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎక్క‌డ లేని స్పీడును చూపించాయి. దాడుల్లో కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పిన ద‌ర్యాప్తు సంస్థ‌లు... కార్తీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా అడ్డుకునే య‌త్నం చేశాయి. కార్తీపై దాడుల‌తో బెంబేలెత్తిపోయిన చిదంబ‌రం... త‌న‌పై రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కే మోదీ స‌ర్కారు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉసిగొలుపుతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక ఇప్పుడు చిద్దూ భాయి ఫ్యామిలీని కాస్తంత ప‌క్క‌న పెట్టేసిన ద‌ర్యాప్తు సంస్థ‌లు మొన్న ఉద‌యాన్నే కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియ‌ర్ మ‌హిళా నేత జ‌యంతి న‌ట‌రాజ‌న్‌ పై ప‌డ్డాయి. దాదాపుగా రెండు రోజుల పాటు జ‌యంతి ఇల్లు - కార్యాల‌యాల‌పై ముమ్మ‌ర సోదాలు చేసిన సీబీఐ... నిన్న పొద్దుగూకే స‌మ‌యంలో దాడులు పూర్త‌య్యాయ‌ని ప్ర‌క‌టించింది. సోదాలు ముగిశాయ‌ని చెప్పిన సీబీఐ అధికారులు... జ‌యంతి ఇంటి నుంచి బ‌స్తాల కొద్దీ ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకుని అక్క‌డి నుంచి నిష్క్ర‌మించార‌ట‌.

అంతేకాకుండా పోతూ పోతూ జ‌యంతి చేతిలో స‌మ‌న్ల‌ను కూడా పెట్టేసి వెళ్లార‌ట‌. సోదాల సంద‌ర్భంగా ల‌భ్య‌మైన ప‌త్రాల‌కు సంబంధించి విచార‌ణ జ‌ర‌పాల్సి ఉంద‌ని, తాము కోరిన స‌మ‌యంలో త‌మ ముందు హాజ‌రు కావాల‌ని ఆ స‌మ‌న్ల‌లో ఆమెకు వారు ఆదేశాలు జారీ చేసి వెళ్లార‌ట‌. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే... జ‌యంతిని అరెస్ట్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే... చిద్దూ భాయ్ ఫ్యామిలీని ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ద‌ర్యాప్తు సంస్థ‌లు... జ‌యంతిని ఇప్పుడు టార్గెట్ చేశాయ‌న్న‌మాట‌. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?