Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ, టీడీపీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు

By:  Tupaki Desk   |   18 Dec 2020 10:00 AM GMT
మాజీ ఎంపీ, టీడీపీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు
X
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తోంది. ట్రాన్స్ ట్రాయ్ కేసు విషయంలో ఆయన నివాసంలో ఉదయం నుంచి ఈ దాడులు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తనిఖీలపై సీబీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టారనే ఆరోపణలపై రాయపాటి కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలో రెండు సార్లు సీబీఐ అధికారులు రాయపాటి ఇంట్లో సోదాలు చేసి సమాచారం సేకరించారు.

రాయపాటి కంపెనీ సీఈవోగా పనిచేసిన శ్రీధర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు రాయపాటి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ పైన సీబీఐకి రాయపాటి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రాయపాటి ఇల్లు, కార్యాలయంతోపాటు శ్రీధర్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు.

రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి వ్యాపారం నిమిత్తం ఏకంగా 300 కోట్ల రూపాయల దాకా రుణం తీసుకుంది. అయితే బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఆ సంస్థ కాలయాపన చేస్తోంది. దీంతో రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ, దాని యజమాని అయిన రాయపాటిపై ఇండియన్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లో సైతం సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇక రాయపాటికి చెందిన వేరే ఇతర ఆస్తులను కూడా వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ కూడా కొద్దిరోజుల కిందట ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు నుంచి ట్రాన్స్ ట్రాయ్ ఇండియా, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మీ పేరుతో రుణం తీసుకున్నారు.