Begin typing your search above and press return to search.

సోనియాజీ...బోఫోర్స్ ముంచుకొచ్చేస్తోందండీ!

By:  Tupaki Desk   |   21 Oct 2017 4:35 AM GMT
సోనియాజీ...బోఫోర్స్ ముంచుకొచ్చేస్తోందండీ!
X
కాంగ్రెస్ పార్టీ... గ‌త‌మంతా వైభ‌వం - ప్ర‌స్తుతం అంతా స‌మ‌స్య‌ల మ‌యంలా మారిపోయింది. నాలుగేళ్ల కింద‌ట జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఏకంగా వ‌రుస పెట్టి ప‌దేళ్ల పాటు అధికారం చెలాయించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ... ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా చ‌తికిల‌బ‌డిపోయింది. బీజేపీ సంధించిన మోదీ మేనియాతో అప్ప‌టిదాకా పాల‌న సాగించిన కాంగ్రెస్ పార్టీ ఆ త‌ర్వాత క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా పొందేందుకు అవ‌స‌ర‌మైన సీట్ల‌ను కూడా గెలుచుకోలేక‌పోయింది. అంతేనా... మోదీ త‌ర‌హా పాల‌న‌తో ఏనాడూ కోర్టు మెట్లెక్క‌ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ - ఆమె కుమారుడు పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీలు న్యాయ‌స్థానం గ‌డ‌ప తొక్కాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత రాహుల్ గాంధీ ఏకంగా పోలీస్ స్టేష‌న్ లోకీ అడుగు పెట్ట‌క త‌ప్ప‌లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్నీ అప‌శ‌కునాలేన‌న్న మాట‌. ఈ త‌ర‌హా ఇబ్బందిక‌ర‌మైన వాతావ‌ర‌ణం కాంగ్రెస్ పార్టీకి మ‌రింత ఎక్కువ కానుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

సోనియా గాంధీ భ‌ర్త‌ - మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌యాంలో వెలుగుచూసిన బోఫోర్స్ కుంభ‌కోణం కేసును తిర‌గ‌దోడేందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా వినిపిస్తున్న వార్త‌లు కాంగ్రెస్ పార్టీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా ఈ కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్న హిందూజా సోద‌రుల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన త‌ర్వాత మ‌ళ్లీ ఈ కేసును ఎలా ఓపెన్ చేస్తార‌నేగా మీ డౌటు? ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నాడే కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సీబీఐ త‌ల‌చినా... నాడు అధికారంలో ఉన్న యూపీఏ స‌ర్కారు దాని ముంద‌రి కాళ్లకు బంధాలేసింద‌ట‌. మ‌రి ఇప్పుడు న‌రేంద్ర మోదీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ఆ బంధాలు తెగిపోయిన‌ట్లే క‌దా. అయినా మోదీ ప్ర‌ధాని అయి ఇప్ప‌టికే మూడున్న‌రేళ్లు దాటిపోయింది. ఈ మూడున్న‌రేళ్ల పాటు ఈ కేసు విష‌యాన్నే ప‌ట్టించుకోని సీబీఐ... ఇప్పుడే ఈ కేసును తిర‌గ‌దోడాల‌ని చూస్తుండ‌టానికి గ‌ల కార‌ణాలేమిట‌న్న విష‌యానికి వ‌స్తే చాలా ఆస‌క్తిక‌ర అంశాలే వెలుగు చూస్తున్నాయి.

2005 - మే 31 న బ్రిటన్‌ కు చెందిన వాణిజ్యవేత్తల కుటుంబం హిందూజా సోదరులు శ్రీచంద్‌ - గోపీచంద్‌ - ప్రకాశ్‌ చంద్‌ లపై నమోదయిన అభియోగాలను కొట్టేస్తూ.. వారిని నిర్దోషులుగా ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. అయితే తీర్పు వెలువ‌డ్డ 90 రోజుల్లోగా తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. సీబీఐ ఆ పని చేయలేదు. దీనికి ప్రభుత్వం నుంచి దర్యాప్తు విభాగంపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ఆ ఆదేశాలను ఛాలెంజ్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ దాఖలు చేసేందుకు సీబీఐ దాదాపుగా కార్య‌రంగాన్ని మొత్తం సిద్ధం చేసిన‌ట్లు సమాచారం. ఈ పిటిష‌న్ దాఖ‌లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూలైలో బిజూ జనతాదళ్‌ ఎంపీ భర్తృహరి మహతబ్‌ నేతృత్వంలోని కమిటీ పార్లమెంట్‌ కు సమర్పించిన నివేదికలో... బోఫోర్స్‌ కేసు విచారణలో చాలా లోపాలున్నాయని పేర్కొన‌డం తెలిసిందే.

ఆ వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ.. సుప్రీంకోర్టు లేదా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే భోఫోర్స్‌ కేసుపై పునర్విచారణ సాధ్యమవుతుందని ప్రకటించింది. దీనికి తోడు ఈ మధ్యే ప్రైవేట్‌ డిటెక్టివ్‌ మైకేల్‌ హెర్షమ్‌ బోఫోర్స్‌ గురించి చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటామని కూడా ప్రకటించటంతో ముప్పై ఏళ్ల బోఫోర్స్‌ మళ్లీ తెరపైకి వచ్చినట్లయ్యింది. ఈ మధ్యలో బీజేపీ నేత అజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ పునర్విచారణ కోసం దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. అక్టోబర్‌ 30 తర్వాత విచారణ చేపడతామని ప్రకటించింది కూడా. ఈ నేప‌థ్యంలోనే రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసు పున్వరిచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. ఇదే జ‌రిగితే... ఇప్ప‌టికే నానా క‌ష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు మ‌రో పెద్ద త‌ల‌నొప్పి ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.