Begin typing your search above and press return to search.

మోదీని దీదీ కలిసినా.. రాజీవ్ కు అరెస్ట్ తప్పట్లేదే

By:  Tupaki Desk   |   21 Sep 2019 5:17 PM GMT
మోదీని దీదీ కలిసినా.. రాజీవ్ కు అరెస్ట్ తప్పట్లేదే
X
నిజమే... మొన్నటిదాకా ఉప్పూ నిప్పూ మాదిరిగా వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోదీ - తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య భేటీ జరిగినా కూడా పెద్దగా ఫలితం లేదనే చెప్పాలి. సీఎం హోదాలో ఉండి కూడా తనకు అనుకూలంగా ఉన్న కోల్ కతా తాజా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అదికారులు వస్తే... వారిని తరిమికొట్టినంత పనిచేయించిన దీదీ... రాజీవ్ ను కాపాడుకునేందుకు ఏకంగా నడిరోడ్డుపై దీక్షకు దిగారు. ఈ హఠాత్పరిణామంతో అప్పటికప్పుడు రాజీవ్ అరెస్ట్ వాయిదా పడ్డా... ఇప్పుడు మాత్రం ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోలేరనే చెప్పక తప్పదు. మొన్నటి మోదీ - దీదీ భేటీ రాజీవ్ ను అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకేనన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులను చూస్తుంటే... మోదీతో దీదీ భేటీ రాజీవ్ ను ఏమాత్రం కాపాడలేకపోయిందనే చెప్పక తప్పదు.

అయినా ఈ రాజీవ్ కుమార్ ను రక్షించుకునేందుకు దీదీ ఎందుకు అంతగా యత్నిస్తున్నారన్న విషయానికి వస్తే... రాజీవ్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారే కాదు... పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను కలకలం రేపిన శారదా చిట్ ఫండ్ స్కాం కేసును దర్యాప్తు చేసిన అధికారి కూడా. రాజీవ్ ద్వారానే వ్యవహారం నడిపిన దీదీ... స్కాంలో ఇరుక్కున్న తన వాళ్లను రక్షించుకున్నారని - ఆ వ్యవహారం ముగియగానే రాజీవ్ ను ఏకంగా కోల్ కతా కమిషనర్ గా ప్రమోట్ చేశారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. తన వాళ్లను స్కాం నుంచి బయటపడవేసిన కారణంగానే ఆయనకు కోల్ కతా కమిషనర్ పదవితో పాటు... ఆయనను అరెస్ట్ చేయకుండా సీబీఐ అధికారులకు కూడా అడ్డగింతలు కల్పించారని దీదీపై ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే రాజీవ్ ను అరెస్ట్ చేసి తీరేందుకే సీబీఐ నిర్ణయించగా... ఆ ముప్పు నుంచి రాజీవ్ ను కాపాడేందుకే మొన్న ఢిల్లీ వెళ్లిన మమతా బెనర్జీ... నేరుగా మోదీతో భేటీ అయ్యారని వార్తలు వినిపించాయి. అయితే తనతో భేటీ అయిన దీదీ చెప్పిన విషయాలన్నీ విన్న మోదీ... అప్పటికి కాస్తంత శాంతించినట్టే కనిపించినా.. శారదా స్కాంపై మాత్రం వెనకడుగు వేసేందుకు సిద్ధపడలేదట. ఈ క్రమంలోనే రాజీవ్ అరెస్ట్ కోసం సీబీఐ సన్నాహాలు చేస్తున్నా... మోదీ కిమ్మనకుండా ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా రాజీవ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను అలీపూర్ కోర్టు తోసిపుచ్చేసింది. అంతేకాకుండా తమ ఎదుట విచారణకు హాజరుకాని రాజీవ్ ను అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు... విచారణకు రాకుండా సతాయిస్తున్న రాజీవ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా ఆదేశాలు అవవసరం లేదని కూడా తేల్చి చెప్పింది. దీంతో అప్పటికప్పుడే రంగంలోకి దిగిపోయిన సీబీఐ... రాజీవ్ కోసం కోల్ కతాతో పాటు ఆయన ఉన్నారని భావిస్తున్న అన్ని ప్రాంతాల్లో జల్లెడ పడుతోంది. ఏ క్షణమైనా అధికారులు రాజీవ్ ను అరెస్ట్ చేయడం ఖాయమేనని తెలుస్తోంది. మొత్తంగా మోదీతో దీదీ నెరపిన రాజకీయంతో రాజీవ్ కు ఉపశమనం లభించలేదన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.