Begin typing your search above and press return to search.

చీపురు పార్టీ సర్కారుకు మళ్లీ షాక్.. వెయ్యి బస్సుల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:19 AM GMT
చీపురు పార్టీ సర్కారుకు మళ్లీ షాక్.. వెయ్యి బస్సుల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు
X
తాము టార్గెట్ చేస్తే.. సాధించేందుకు వరకు విడవకుండా వ్యవహరించే ధోరణి కేంద్ర ప్రభుత్వాల్లో పరిమితంగానే ఉండేది. తొందరపాటు తీరును అస్సలు ప్రదర్శించేవారు కాదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని మోడీ సర్కారు.

తాను కత్తి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించటమే కాదు.. వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేసే తీరు ఈ మధ్యన మరింత ఎక్కువైంది. ఇప్పటికే లిక్కర్ స్కాంతో కిందా మీదా పడుతున్న కేజ్రీవాల్ సర్కారుపై తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మరోసారి తనదైన నిర్ణయాన్ని తీసుకొని సంచలనంగా మారారు.

ఢిల్లీలో వెయ్యి లో-ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. టెండరింగ్.. బస్సులు కొనుగోలుకు ఢిల్లీ రవాణా కొర్పరేషన్ ఆధ్వర్యంలో వేసిన కమిటీకిరవాణా మంత్రిని ఛైర్మన్ గా నియమించారు.

ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఎపిసోడ్ లో భారీగా డబ్బులు చేతులు మారినట్లుగా పేర్కొన్నారు. ఈ అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ వివరణ కోరగా.. డబ్బులు చేతులు మారిన అంశంపై స్పందించిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఆ ఆరోపణలు వాస్తవమేనంటూ నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలో స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐను ప్రాథమిక విచారణకు ఆదేశించింది. దీంతో.. ఆ విచారణ సంస్థ తన ప్రాథమిక దర్యాప్తును షురూ చేసింది.

బస్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. అవినీతి అనేవి పర్యాయ పదాలుగా మారినట్లుగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మండిపడుతన్నారు. కేజ్రీవాల్ తన మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు.. టెండర్లు కట్టబెడుతున్నట్లుగా ధ్వజమెత్తారు.మరి.. ఈ అంశంపై చీపురు పార్టీ ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.