Begin typing your search above and press return to search.

ఏపీ ఏసీబీతో పేచీ!... సీబీఐదే విజ‌యం!

By:  Tupaki Desk   |   1 May 2019 10:02 AM GMT
ఏపీ ఏసీబీతో పేచీ!... సీబీఐదే విజ‌యం!
X
ఏపీలోకి సీబీఐకి ఎంట్రీ లేదంటూ ఏపీ సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు గ‌తంలో ఆర్డ‌ర్స్ పాస్ చేశారు క‌దా. కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారుకు జేబు సంస్థ‌గా మారిపోయిన సీబీఐ అధికారులు... త‌మ పార్టీకి చెందిన నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్నార‌న్న అనుమానంతోనే చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యంతో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే సీబీఐ అధికారులు ఏపీ ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి ప‌రిస్థితిలో సీబీఐపై విజ‌యం సాధించేశామ‌ని ఏపీ పోలీసులు కూడా సంబ‌రాలు చేసుకున్నారు. ఏపీ ప‌రిధిలో అవినీతికి పాల్ప‌డితే సీబీఐ అధికారుల‌ను కూడా అరెస్ట్ చేస్తామంటూ ఏపీ ఏసీబీ అధికారులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. మొత్తంగా చంద్ర‌బాబు స‌ర్కారు ఆదేశాల‌తో ప‌రిస్థితి సీబీఐ వ‌ర్సెస్ ఏపీ ఏసీబీగా మారిపోయింది. అయితే ఈ పోరులో అంతిమ విజ‌యం సాధించింది సీబీఐనే అన్న వాద‌న ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది. సీబీఐ విజ‌యం సాధిస్తే... ఏపీ ఏసీబీ ఓట‌మిని అంగీక‌రించిన‌ట్టే క‌దా. అంటే చంద్ర‌బాబు స‌ర్కారు కూడా ఓడిన‌ట్టే క‌దా.

అయితే అస‌లు క‌థ‌లోకి వెళ్లిపోదాం ప‌దండి. ఆదాయప‌న్ను శాఖకు సంబంధించి ఏపీలో తెనాలి-1 ఐటీ అధికారిగా ప‌నిచేస్తున్న అవుతు చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌న్ను మ‌దింపు విష‌యానికి సంబంధించి ఏపీకి చెందిన ఓ ఎన్నారై నుంచి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి రూ.7.5 ల‌క్ష‌ల మేర లంచం డిమాండ్ చేశారు. ఒళ్లు మండిన స‌ద‌రు ఎన్నారై సాదారణంగా అయితే ఏపీ ఏసీబీని ఆశ్ర‌యించాలి. అయితే ఆయ‌న‌కు ఏపీ ఏసీబీ మీద న‌మ్మ‌కం లేదో - ఇంకే కార‌ణ‌మో తెలియ‌దు గానీ... నేరుగా సీబీఐని ఆశ్ర‌యించారు. ఇంకేముంది ప‌ర్మిష‌న్ గిర్మిష‌న్ల‌ను ప‌క్క‌న‌పెట్టేసిన సీబీఐ రంగంలోకి దిగిపోయింది. చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసి పారేసింది. అప్ప‌టిదాకా అస‌లు విష‌య‌మే తెలియ‌ని ఏపీ ఏసీబీ... రాష్ట్రంలోని సీబీఐ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా ఏకంగా త‌మ ప‌రిధిలోని ఓ అధికారిని కూడా అరెస్గ్ చేసిందా? అంటూ కుత‌కుత‌లాడిపోయింది. ఈ షాక్ నుంచి తేరుకోవ‌డానికి ఏపీ ఏసీబీకి ఏకంగా 24 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది.

అనుమ‌తి లేకుండా ఏపీలోకి ఎలా ఎంట్రీ ఇస్తారంటూ సీబీఐ అధికారుల‌ను ప్ర‌శ్నించేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. అయితే ఈ విష‌యాన్ని ముందే ప‌సిగట్టి సీబీఐ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఏపీ ఏసీబీకి మ‌రో షాకిచ్చింది. లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్ గానే చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిని తాము అరెస్ట్ చేశామ‌ని - అయితే ఏపీలో ఉన్న నిబంధ‌న‌ల కార‌ణంగా ఆయ‌నను మీకే అప్ప‌గిస్తున్నామంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పాటు చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిని ఏసీబీకి అప్ప‌గించేసి వెళ్లిపోయింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఏపీలోకి సీబీఐ అధికారులు ఎంట్రీ ఇస్తేనే స‌హించేది లేదని చంద్ర‌బాబు స‌ర్కారుతో పాటు ఏసీబీ అధికారులు ఎంత‌గా భుజాలు చ‌రుచుకున్నా... ఫిర్యాదు వ‌స్తే... త‌మ వేగం ఎలా ఉంటుందో, త‌మ‌ను ఏ ఒక్క‌రు ఎలా అడ్డుకోలేరో సీబీఐ చేసి చూపింద‌న్న మాట‌. మొత్తంగా ఏపీ ఏసీబీతో పాటు చంద్ర‌బాబు కూడా ఈ విష‌యంలో ఓడిపోయినట్టే క‌దా.