Begin typing your search above and press return to search.

బ్యాంకుల‌ను ముంచుతున్న ఇంటిదొంగ‌లు

By:  Tupaki Desk   |   3 March 2018 5:51 AM GMT
బ్యాంకుల‌ను ముంచుతున్న ఇంటిదొంగ‌లు
X
వరుస కుంభకోణాలతో కుదేలవుతున్న దేశీయ బ్యాంకింగ్ రంగంలో తాజాగా మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని హసన్‌ పూర్ ప్రథమ అనే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ శాఖలో రూ.14 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఆ శాఖ మేనేజర్‌ ను అరెస్టు చేసి అతనితో పాటు ఎనిమిది మంది ఇతర ఉద్యోగులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. తమ శాఖలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని గుర్తించిన ప్రథమ గ్రామీణ బ్యాంక్ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. మోసాన్ని గుర్తించిన వెంటనే ఆ బ్యాంక్ తన యూజర్ ఐడీని - పాస్‌ వర్డ్‌ ను సస్పెండ్ చేసింది.

ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రథమ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ విపిన్ కుమార్ - ఇతర ఉద్యోగులు తొలుత ఆ సొమ్మును ఆ బ్యాంకులోని పలు కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాల్లో జమచేసి ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఓవర్‌ డ్రాఫ్ట్ ఖాతాలకు - ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. దేశీయ బ్యాంకుల్లో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్న తరుణంలోనే ఈ కుంభకోణం కూడా బట్టబయలు కావడం గమనార్హం. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ)లో రూ.12 వేల కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఆ బ్యాంకు దర్యాప్తు సంస్థలను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండ‌గా..బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణాల్లో సొంత సిబ్బంది ప్రమేయం నానాటికీ పెరుగుతున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌ బీ)ల్లో గత కొన్నేళ్ల నుంచి వెలుగు చూసిన అనేక మోసాలను లోతుగా పరిశీలించి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ)లో ఇటీవల రూ.12 వేల కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఇంటి దొంగల ప్రమేయంతో లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జరిగిన మోసాల వివరాలను - వాటి వలన బ్యాంకులకు జరిగిన నష్టాన్ని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గణాంకాలతో సహా వెల్లడించింది. 2013 ఏప్రిల్ నుంచి 2016 జూన్ వరకు ఇటువంటి 1,232 మోసాల (సిబ్బంది ప్రమేయంతో జరిగిన లక్ష రూపాయల కంటే ఎక్కువ మోసాల) వలన ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొత్తం రూ.2,450 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం కేసుల్లో మహారాష్ట్ర సహా దక్షిణాది రాష్ర్టాలు 609 కేసులతో 49 వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఇటువంటి కేసుల వలన బ్యాంకులకు జరిగిన మొత్తం నష్టంలో దక్షిణాది రాష్ర్టాల వాటా కేవలం 19 శాతం (రూ.462 కోట్లు) మాత్రమే. రాజస్థాన్‌ లో ఇటువంటి మోసాలు కేవలం 3 శాతం (38 కేసులు) మాత్రమే అయినప్పటికీ వాటి వలన బ్యాంకులకు భారీ మొత్తంలో రూ.1,096 కోట్ల (44 శాతం) నష్టం వాటిల్లడం గమనార్హం.

బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో జరిగిన మోసాల సంఖ్య తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ - కర్నాటక - మహారాష్ట్రల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ రాజస్థాన్ - చండీగఢ్ - ఢిల్లీ - పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో ఇటువంటి మోసాల వలన బ్యాంకులకు ఎక్కువ నష్టం జరిగింది. పీఎస్‌ బీలకు వాటిల్లిన మొత్తం నష్టంలో ఈ మూడు రాష్ర్టాల సమష్టి వాటా 70 శాతం మేరకు ఉన్నట్లు రిజర్వు బ్యాంకు వెల్లడించింది.