Begin typing your search above and press return to search.

చంద్రబాబు, లోకేష్ కు ఏమైంది ?

By:  Tupaki Desk   |   20 Sep 2021 5:03 AM GMT
చంద్రబాబు, లోకేష్ కు ఏమైంది ?
X
ఎక్కడా చంద్రబాబునాయుడు, లోకేష్ గొంతు వినిపించటమే లేదు. పరిషత్ ఎన్నికల ఫలితాలు రావటం మొదలైన దగ్గర నుండి వీళ్ళద్దరి గొంతులు మూగపోయాయి. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఒకలాగ, వ్యతిరేకంగా ఉంటే మరోలాగ వీళ్ళద్దరి వ్యవహారం ఉంటుంది. గతంలో కూడా పంచాయితి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా కూడా వీళ్ళద్దరు రెండు మూడు రోజుల పాటు ఎక్కడా మాట్లాడలేదు. కనీసం తమ పార్టీ నేతలతో కూడా మాట్లాడటానికి ఇష్టపడలేదు.

ఇపుడు పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే పద్దతి అనుసరిస్తున్నారు. నిజానికి స్ధానికసంస్ధల ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి అనుకూలంగా ఉంటాయనటంలో ఆశ్చర్యమేమీలేదు. కాబట్టి టీడీపీ ఓటమికి చంద్రబాబు కుంగిపోవాల్సిన పనిలేదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇలాంటి ఫలితాలు చాలానే చూసుంటారు. కాకపోతే ఎన్నికలు ఏవైనా వరసబెట్టి ఏకపక్షంగా అధికార వైసీపీకి అనుకూలంగా ఉండటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.

తాజా ఫలితాలను గమనించిన తర్వాతైనా సాకులను చంద్రబాబు పక్కనపెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనిచేసిందని, ధౌర్జన్యాలు, అక్రమాలతో ఎన్నికలను ఏకపక్షం చేసుకుందనే పడికట్టు పదాలను పక్కనపెట్టేయాలి. వచ్చిన ఫలితాలపై నిజాయితీగా విశ్లేషించుకోవాలి. జనాలు అధికారపార్టీని ఎందుకింతగా ఆదరిస్తున్నారు ? టీడీపీలో లోపాలెక్కడ ఉన్నాయి ? జనాదరణను పొందాలంటే టీడీపీ చేయాల్సింది ఏమిటి ? అనే విషయాలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఓటమికి కారణాలను నిజాయితీగా విశ్లేషించుకుంటే బలోపేతమయ్యేందుకు మార్గాలు అవే దొరుకుతాయి.

తాజా ఫలితాలను అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. టీడీపీ బహిష్కరించిన ఎన్నికల్లో వైసీపీ గెలుపు కూడా ఓ గెలుపేనా అంటు ఎగతాళి చేస్తున్నారు. వీరు చెప్పింది నిజమే అనుకుంటే టీడీపీ ఎన్నికలను బహిష్కరించినపుడు ఓటర్లు తమ ఓట్లను వైసీపీకే వేయాల్సిన అవసరం లేదుకదా. పోటీలో కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ+జనసేన పార్టీలున్నా ఓట్లన్నీ వైసీపీకే ఎందుకు పడ్డాయి ?

కాబట్టి వైసీపీ ఏకపక్ష విజయాన్ని చులకన చేయకుండా జిల్లాల వారీగానో లేకపోతే నియోజకవర్గాల వారీగానో నిజాయితీతో విశ్లేషణ చేసుకోవాలి. ఇపుడు మూగబోయిన చంద్రబాబు, లోకేష్ గొంతులు కనీసం విశ్లేషణ సంద్భంగా అయినా గట్టిగా వినిపించాలి. ఎప్పుడూ వీళ్ళు మాట్లాడటం, నేతలు వినటం కాకుండా ఇప్పటినుండి నేతలను, కార్యకర్తలను మాట్లాడనివ్వాలి. నేతలు, కాయకర్తలను మాట్లాడనిస్తేనే క్షేత్రస్ధాయిలోని వాస్తవాలు బయటపడతాయని చంద్రబాబు, లోకేష్ గ్రహించాలి.