Begin typing your search above and press return to search.

బాబుపై విజ‌య‌సాయిరెడ్డి కామెంట్...కుక్క తోక వంక‌రే!

By:  Tupaki Desk   |   18 Jun 2019 2:30 PM GMT
బాబుపై విజ‌య‌సాయిరెడ్డి కామెంట్...కుక్క తోక వంక‌రే!
X
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడును వ‌రుస‌గా టార్టెగ్ చేస్తున్న వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - పార్ల‌మెంట్ లో ఆ పార్టీ ప‌క్ష నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి వేసే పంచ్‌ లు - సెటైర్లు బాగానే పేలుతున్నాయి. చంద్ర‌బాబు విధానాల‌పై నిత్యం విమ‌ర్శ‌లు సంధిస్తూ సాగుతున్న విజ‌య‌సాయిరెడ్డి... తాజాగా సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించి ఖ‌ర్చు అయిన మొత్త‌మిది అంటూ వైర‌ల్ గా షేర్ అవుతున్న ఓ ప‌త్రాన్ని ఊటంకిస్తూ తాజాగా మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. 2014లో తొలి అరు నెలల్లోనే ఏకంగా నెల రోజుల పాటు విదేశాల్లోనే గ‌డిపిన చంద్ర‌బాబు... అందుకోసం ఏకంగా ప్ర‌జ‌ల సొమ్ములో రూ.8,33,98,444 ను మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేశార‌ని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రానికి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా విదేశాల‌కు వెళుతున్న‌ట్లుగా చెప్పుకున్న చంద్ర‌బాబు... త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు అయిన ఖ‌ర్చులో పైసా వంతు పెట్టుబ‌డులు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయార‌ని త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు సంధించారు.

ఇక సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లో పార్ట్‌ న‌ర్ స‌మ్మిట్ పేరిట మూడు రోజుల పాటు అట్ట‌హాసంగా స‌మావేశాల‌ను నిర్వ‌హించిన చంద్ర‌బాబు స‌ర్కారు... రూ.4.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఒప్పందాలు కుదిరాయ‌ని బాకాలు ఊదింద‌ని ఆరోపించారు. అయితే ఈ స‌మావేశాల పేరిట రూ.100 కోట్ల‌ను ఖ‌ర్చు చేసిన బాబు స‌ర్కారు... సింగిల్ రూపాయి పెట్టుబ‌డి కూడా సాధించ‌లేక‌పోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. దీనిపై చంద్ర‌బాబు చెప్పుకున్న గొప్ప‌లు విని నీతి ఆయోగ్ బిత్త‌ర‌పోయింద‌ని కూడా విజ‌య‌సాయిరెడ్డి త‌న‌దైన శైలి సెటైర్ సంధించారు. ఇన్ని చేసిన కార‌ణంగానే చంద్ర‌బాబుకు ఘోర ఓట‌మి త‌ప్ప‌లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. త‌న త‌ప్పులు క‌ళ్లెదుటే క‌నిపిస్తున్నా... ఇంకా తాను ఎందుకు ఓడిపోయానో అర్థం కావ‌డం లేదంటూ చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన విజ‌య‌సాయిరెడ్డి... చంద్ర‌బాబు తీరు కుక్క తోక వంక‌రే అన్న‌ట్లుగానే సాగుతోంద‌ని విమ‌ర్శించారు.

సాయిరెడ్డి ట్వీట్ ఎలా సాగిందంటే... *చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఒక పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదటి ఆరునెలల్లో సారు నెలరోజులు విదేశాల్లోనే గడిపారు. మందీ మార్బలాన్ని వెంటేసుకుని సింగపూర్ - చైనా - స్విట్జర్లాండ్ - జపాన్ సందర్శించారు. ఏం సాధించారో ఎక్కడా కనిపించదు. 2018 ఫిబ్రవరిలో విశాఖలో అట్టహాసంగా జరిపిన పార్టనర్ షిప్ సమిట్లో రూ.4.50 లక్షల కోట్ల పెట్టుబడులపై సంతకాలు జరిగాయని చంద్రబాబు ప్రకటించారు. 100 కోట్ల వృథా ఖర్చు తప్ప రూపాయి పెట్టుబడి రాలేదు. నీతి ఆయోగ్ బిత్తరపోయిందట ఈయన స్టేట్ మెంట్ చూసి. ఐదేళ్లూ ఇలాగే మభ్య పెట్టారు ప్రజలను. చంద్రబాబు నైజమే అంత. 2004 - 09 ఎన్నికల్లో పరాజయం పాలైనప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. తనను ఓడించినందుకు ప్రజలను తప్పుపట్టారు తప్ప వారి విశ్వాసం ఎందుకు పొందలేకపోయాం అనే ఆత్మ విమర్శ ఎన్నడూ చేసుకోలేదు. ఇప్పుడూ అంతే. ఎందుకు ఓడామో అంతుబట్టట్లేదంటున్నాడు. కుక్క తోక వంకరే.'' అంటూ వరస ట్వీట్లలో విజ‌య‌సాయిరెడ్డి విరుచుకుపడ్డారు.