Begin typing your search above and press return to search.

తిరుప‌తిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఆ రెండు విష‌యాల్లో సీన్ రివ‌ర్స్‌!!

By:  Tupaki Desk   |   12 April 2021 6:42 AM GMT
తిరుప‌తిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఆ రెండు విష‌యాల్లో సీన్ రివ‌ర్స్‌!!
X
తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు హోరా హోరీగా పోరాడుతు న్నాయి. గెలుపు త‌థ్య‌మ‌ని భావిస్తున్న వైసీపీ భారీ ఎత్తున మెజారిటీ ల‌క్ష్యంగా పెట్టుకుని ప్ర‌చారం సాగిస్తోంది. ఇక‌, తాము గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా. వైసీపీకి మాత్రం మెజారిటీ భారీగా త‌గ్గించాల‌ని ప‌ట్టుద‌ల‌తో టీడీపీ ఇక్క‌డ హోరా హోరీగా త‌ల‌ప‌డుతోంది. అయితే.. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే రెండు ప్ర‌ధాన విష‌యాలు ఈ రెండు పార్టీల మ‌ధ్య రివ‌ర్స్ యాంగిల్‌లో దూసుకు వ‌స్తున్నాయి.

1. వివేకా హ‌త్య కేసు:
2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో వివేకా హత్య‌కేసును ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా వైసీపీ తీసుకుంది. ఈ హ‌త్య వెనుక అధికార పార్టీ టీడీపీనే ఉంద‌ని.. వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. దీనిని సీబీఐకి అప్ప‌గించాల‌ని కూడా జ‌గ‌న్ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు క‌నుక‌నే సీబీఐకి ఇవ్వ‌డం లేద‌ని కూడా విరుచుకుప‌డ్డారు. దీంతో టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితిని ఒకానొక ద‌శ‌లో ఎదుర్కొన్నారు టీడీపీ నాయ‌కులు.

ఇక‌, ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఇదే విష‌యాన్ని అస్త్రంగా చేసుకుని టీడీపీ చెల‌రేగుతోంది. జ‌గ‌న్ త‌న సొంత బాబాయి.. వివేకానంద రెడ్డి హ‌త్య కేసును ఇప్ప‌టి వ‌ర‌కు తేల్చ‌లేక పోయార‌ని.. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అయినా.. హంత‌కుల‌ను గుర్తించ‌లేక పోయార‌ని.. సొంత బాబాయి కేసును తేల్చ‌లేని వాడు.. ప్ర‌జ‌ల‌కు ఎలా ర‌క్ష‌ణ క‌ల్పిస్తాడ‌ని.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. లోకేష్ ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. ఇక‌, చంద్ర‌బాబు సైతం ఇదే ధోర‌ణితో ముందుకు సాగుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ఏం చెప్పాలో తెలియ‌క ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు. విష‌యం ఒక్క‌టే అయినా.. ఆనాడు.. ఈనాడు ఆరోప‌ణ‌లు రివ‌ర్స్ అయ్యాయి.

2. ప్ర‌త్యేక హోదా:
2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇదే విష‌యంపై వైసీపీ తీవ్ర‌స్థాయిలో టీడీపీని ఏకేసింది. అధికారంలో ఉండి.. ప్ర‌త్యేక హోదా సాధించ‌లేద‌ని.. ప్యాకేజీ తీసుకుని.. ఢిల్లీ పెద్ద‌ల‌కు లొంగిపోయార‌ని.. జ‌గ‌న్ స్వ‌యంగా చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు. త‌మ‌కు పాతిక మంది ఎంపీల‌ను ఇస్తే.. డిల్లీ పెద్ద‌ల మెడ‌లు వంచి హోదా సాదిస్తామ‌న్నారు. దీంతో అప్ప‌ట్లో టీడీపీ ఈ సెగ నుంచి బ‌య‌ట ప‌డేందుకు నానా ప్ర‌యాస ప‌డాల్సి వ‌చ్చింది.

ఇక‌, ఇప్పుడు ఇదే హోదా విష‌యాన్ని టీడీపీ టార్గెట్ చేసుకుని.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో వైసీపీపై విమ‌ర్శ‌ల బాణాలు సంధిస్తోంది. 22 మంది ఎంపీలు ఉన్నా.. జ‌గ‌న్ ఏం చేశార‌ని.. ఆనాడు మ‌మ్మ‌ల్ని రాజీనామా చేయ‌మ‌న్న జ‌గ‌న్‌.. ఇప్పుడు ఎందుకు ఆ మాట మ‌రిచిపోయార‌ని.. చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ 22 మంది ఎంపీలు గొర్రెల మందేన‌ని.. మ‌రో గొర్రెను పంపించ‌డం అవ‌స‌ర‌మా? అని కూడా టీడీపీ సీనియ‌ర్లు ప్ర‌భుత్వంపై దాడి చేస్తున్నారు. దీంతో .. జ‌గ‌న్‌కు ఇప్పుడు స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. చిత్రం ఏంటంటే.. ఇది కూడా సేమ్ టు సేమ్‌.. నాడు వైసీపీకి వ‌రంగా ల‌భించిన ఈ విష‌య‌మే ఇప్పుడు టీడీపీకి చేతికి చిక్కింది. మొత్తానికి విష‌యాలు ఒక్క‌టే అయినా.. రాజ‌కీయం మాత్రం రివ‌ర్స్ కావ‌డం గ‌మ‌నార్హం.