Begin typing your search above and press return to search.

బాబు మిడ్ నైట్ మీట్‌!... వ‌ర్క‌వుట్ కాలేదు!

By:  Tupaki Desk   |   4 Jan 2019 12:35 PM GMT
బాబు మిడ్ నైట్ మీట్‌!... వ‌ర్క‌వుట్ కాలేదు!
X
నాలుగు ప‌దుల వ‌య‌సుకే... 40 ఏళ్ల రాజ‌కీయ ధురంధుడిగా త‌న‌ను తాను ఆకాశానికెత్తుకునే టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చుక్క‌లు చూపిస్తున్నారు. బాబు మార్కు రాజ‌కీయం ఎక్క‌డైనా ఓకే గానీ... జ‌గ‌న్ సొంత ఇలాకాలో మాత్రం కాదు. ఇదే విష‌యం ఇప్ప‌టిదాకా చాలా సార్లు వెల్ల‌డైనా... ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్రుడిలా చంద్ర‌బాబు వ్యూహాలు ప‌న్నుతూనే ఉన్నారు గానీ... క‌డ‌ప‌లో మాత్రం అవేవీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌న్న మాట ఎన్నాళ్ల నుంచో వినిపిస్తున్నదే. అస‌లు క‌డ‌ప జిల్లాలో అన్ని సీట్ల‌కు స‌రిప‌డినంత మంది అభ్య‌ర్థుల‌ను గానీ, జ‌గ‌న్ ఫ్యామిలీకి ధీటుగా నిల‌బ‌డ‌గ‌లిగిన నేత‌ల‌ను గానీ చంద్ర‌బాబు స‌మ‌కూర్చుకోలేక‌పోయార‌న్న విశ్లేష‌ణ‌లు మ‌న‌కు తెలిసిందే. దివంగ‌త సీఎం, మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ప‌రిస్థితి ఎలా ఉన్నా... జ‌గ‌న్ వ‌చ్చాక బాబు పప్పులు అక్క‌డ ఉడ‌క‌డం లేదు. 2014 ఎన్నిక‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారం చేతిలో పెట్టుకుని దొడ్డిదారిన పార్టీ పిరాయింపుల‌తో జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డిని ఓడించామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న చంద్ర‌బాబు అండ్ కో... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏకంగా జ‌గ‌న్‌నే దెబ్బ కొట్టేస్తామ‌ని బీరాలు ప‌లుకుతున్న వైనం జ‌నాల‌కు న‌వ్వు తెప్పిస్తోంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

అయితే ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు క‌డ‌ప జిల్లాలోని త‌న సైన్యంతో స‌మీక్ష‌ల మీద స‌మీక్ష‌లు నిర్వ‌హించేస్తున్నారు. అయినా ఫ‌లితం మాత్రం రాక‌పోవ‌డంతో బాబు జుత్తు పీక్కుంటున్నారు. ఈ క్ర‌మంలో నిన్న రాత్రి కూడా చంద్ర‌బాబు... జ‌గ‌న్‌ను ఓడించేందుకు తెలుగు త‌మ్ముళ్ల‌ను అది కూడా జ‌గ‌న్ జిల్లాకు చెందిన ఇద్ద‌రు రెడ్ల‌ను త‌న ఇంటికి పిలిపించుకున్నార‌ట‌. ఈ మీటింగ్ ఎప్పుడు జ‌రిగిందో తెలుసా? అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు మొద‌లై... తెల్ల‌వారుజామున 3 గంట‌ల దాకా సాగింద‌ట‌. అంటే... మొత్తంగా ఇది మిడ్ నైట్ మీటింగ‌న్న‌మాట‌. మిడ్ నైట్ మ‌సాలా మాదిరిగా ఈ మిడ్ నైట్ మీటింగులెందుకంటే... ప‌ట్ట‌ప‌గ‌లు ఆ ఇద్ద‌రు రెడ్ల‌ను పిలిస్తే... మీడియాలో ఎక్క‌డ గోల గోల అవుతుందోన‌న్న భ‌య‌మేన‌ట‌. అయితే బాబు చాలా తెలివిగా వ్యూహం ర‌చించిన మేర‌కు జ‌రిగిన మిడ్ నైట్ మీట్ ఏమ‌న్నా ఫ‌లితం ఇచ్చిందా? అంటే... అది కూడా లేదు. మిడ్ నైట్ మీట్ అయినా ఫ‌లిస్తుందిలే అని బాబు బ‌లంగా విశ్వ‌సిస్తే... ఆ మీట్‌ కు వ‌చ్చిన ఇద్ద‌రు క‌డ‌ప రెడ్లు దానిని చాలా లైట్ తీసుకున్నార‌ట‌. ఈ మీట్‌ లో పాలుపంచుకున్న ఇద్ద‌రు క‌డ‌ప రెడ్లు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... బాబుకు క్ష‌ణం కూడా తీరిక ఇవ్వ‌కుండా స‌తాయిస్తున్న మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డిలే. జ‌మ్మ‌ల‌మ‌డుగుకు చెందిన ఈ ఇద్ద‌రు రెడ్లు మొన్న‌టిదాకా వైరివ‌ర్గాలుగానే కొన‌సాగినా... ఆది పార్టీ ఫిరాయించ‌డంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రు రెడ్లు ఒకే గొడుగు కింద‌కు వ‌చ్చారు.

పార్టీ ఫిరాయించిన ఆది మంత్రిగా ప‌ద‌వి ద‌క్కించుకుంటే... రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్సీతో స‌రిపెట్టుకున్నారు. ఇదంతా ఇప్ప‌టిదాకా మాత్ర‌మే. మ‌రి రేప‌టి ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు స్థానం ఎవ‌రిది? ఇంకొక‌రిని ఎక్క‌డికి పంపాలి? ఈ ప్ర‌శ్న‌ల‌తో చాలా రోజుల నుంచి మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న చంద్ర‌బాబు... వారిద్ద‌రితోనే చ‌ర్చించి తేల్చేస్తే స‌రిపోతుంద‌ని మిడ్ నైట్ మీట్‌ కు ప్లాన్ చేశార‌ట‌. 3 గంట‌ల పాటు జ‌రిగిన మిడ్ నైట్ మీట్ లో ఈ ఇద్ద‌రు రెడ్ల‌తో పాటు ఎంపీ సీఎం ర‌మేశ్, చంద్ర‌బాబు అనుంగు అనుచ‌రుడు టీడీ జ‌నార్ద‌న్ కూడా పాల్గొన్నార‌ట‌. భేటీలో భాగంగా క‌డ‌ప ఎంపీ సీటు నుంచి ఒక‌రు, జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ నుంచి మ‌రొక‌రు పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు సూచిస్తే... ఇది తాము మాత్ర‌మే తీసుకునే నిర్ణ‌యం కాద‌ని, త‌మ‌ అనుచ‌ర వ‌ర్గంతో చ‌ర్చించి తీసుకునేద‌ని ఆ రెడ్లిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే తేల్చిపారేశార‌ట‌. ఎంతో ఆశించి మిడ్ నైట్ మీట్‌ కు ప్ర‌ణాళిక రూపొందిస్తే... ఇలా జ‌రిగిందేమిట‌బ్బా అంటూ చంద్ర‌బాబు మ‌రోమారు త‌ల ప‌ట్టుకున్నార‌ట‌. అంటే దొడ్డిదారి మంత్రాంగంలో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకున్న చంద్ర‌బాబుకు మిడ్ నైట్ మీట్ కూడా ఫ‌లిత‌మివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హ‌మే క‌దా.