Begin typing your search above and press return to search.

కేసీఆర్ బడాయి మాటల డొల్లతనాన్ని విప్పి చూపించిన ప్రముఖుడు

By:  Tupaki Desk   |   19 April 2020 12:30 AM GMT
కేసీఆర్ బడాయి మాటల డొల్లతనాన్ని విప్పి చూపించిన ప్రముఖుడు
X
కరోనా నేపథ్యంలో తన తీరుకు భిన్నంగా తరచూ మీడియా సమావేశాల్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలానే మాటలు చెప్పారు. కనిపిస్తే కాల్చివేయటమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే ఆ మాత్రం కటువుగా ఉండాల్సిందేనని చెప్పారు. ప్రజల్ని బతికించుకోవాలంటే కఠినమైన చర్యలు తప్పవని చెప్పే ఆయన మాటలకు.. జరుగుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేనిది తెలిసిందే.

కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచటం కోసం సీసీఎంబీని వాడుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుందని ప్రధాని మోడీకే సలహా ఇచ్చారు. అందుకు ఓకే చెప్పిన ప్రధాని రోజుల వ్యవధిలోనే అనుమతులు ఇచ్చారు. ఈ విషయాన్ని చెప్పిన కేసీఆర్.. సీసీఎంబీలో రోజుకు వెయ్యి వరకూ శాంపిల్స్ పరీక్షలు జరిపే వీలుందని.. నిర్దారణ పరీక్షలు త్వరగా పూర్తి అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కట్ చేస్తే.. నిర్దారణ పరీక్షలు ఎన్ని చేస్తున్నారు? రోజూ వెయ్యి పరీక్షలు జరిపే సామర్థ్యం ఉన్నప్పుడు ఇప్పుడెన్ని చేస్తున్నారన్న సందేహం కలుగక మానదు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు సీసీఎంబీ డైరెక్టర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయనకు వేసిన ప్రశ్నతో కేసీఆర్ మాట బడాయితనం బయటకు వచ్చేసింది. వెయ్యి శాంపిల్స్ ను పరీక్షించే సామర్థ్యం ఉందన్న సీసీఎంబీలో రోజుకు 700 శాంపిల్స్ ను టెస్టు చేసే వీలుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాము 350 శాంపిల్స్ మాత్రమే పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. ఎందుకిలా? అంటే.. కిట్ల సమస్య ఉందన్న మాట రావటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రోజుకు 350 శాంపిల్స్ మాత్రమే ఎందుకు పరీక్షిస్తున్నారన్న ప్రశ్నకు ఆయనో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. ఒక సంఖ్య పెట్టుకుంటే..దానికి తగ్గట్లు సాంకేతికంగా చేయాల్సిన ఏర్పాట్లు ఉంటాయని.. రోజూ అన్ని శాంపిల్స్ తప్పనిసరిగా రావాల్సి ఉంటుందన్నారు. ఈ కారణంతోనే 350 శాంపిల్స్ కు పరిమితం చేసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. పెద్ద ఎత్తున ర్యాండమ్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇప్పటివరకూ అలాంటిది జరుగుతున్నది లేదన్న విషయం సీసీఎంబీ డైరెక్టర్ తాజా మాటలతో స్పష్టమైందని చెప్పాలి. వెయ్యి చేస్తామన్న చోట 350 టెస్టులు మాత్రమే జరగటం దేనికి నిదర్శనం సారూ?