Begin typing your search above and press return to search.

సీసీఎంబీని అమృత సంప్ర‌దించిందా?

By:  Tupaki Desk   |   19 Jan 2018 5:32 AM GMT
సీసీఎంబీని అమృత సంప్ర‌దించిందా?
X
దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న అమృత వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రో మలుపు తిరిగింది. దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కూతురిగా చెబుతున్న అమృత‌.. మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా శాస్త్రీయంగా తాను అమ్మ కుమార్తెన‌న్న విష‌యాన్ని రుజువు చేసేందుకు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

తాను చెప్పిన‌ట్లు అమ్మ కుమార్తెన‌న్న విష‌యాన్ని రుజువు చేసేందుకు సెంట‌ర్ ఫ‌ర్ సెల్యుల‌ర్ అండ్ మాలిక్యుల‌ర్ బ‌యాల‌జీ.. సింఫుల్ గా చెప్పాలంటే సీసీఎంబీని సంప్ర‌దించిన‌ట్లుగా చెబుతున్నారు.

హైద‌రాబాద్ కు చెందిన ఈ సంస్థ డీఎన్ ఏ గుట్టుమ‌ట్ల‌పై దీర్ఘ‌కాలంగా ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. ఈ సంస్థ ఇచ్చే నివేదిక‌ను కోర్టులు సైతం అంగీక‌రించే నేప‌థ్యంలో త‌న డీఎన్ ఏ ప‌రీక్ష‌లు జ‌ర‌పాల‌ని అమృత కోరిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదేమంత ఈజీ కాద‌న్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చే అభ్య‌ర్థన‌ల్ని సీసీఎంబీ ప‌రిశీలించ‌ద‌ని.. కోర్టు ద్వారా వ‌చ్చే ఆదేశాల్ని మాత్ర‌మే పాటిస్తుంద‌ని చెబుతున్నారు.

తాను అమ్మ జ‌య‌ల‌లిత కుమార్తెన‌ని అమృత ఇప్ప‌టికే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. సుప్రీం సూచ‌న నేప‌థ్యంలో మ‌ద్రాస్ హైకోర్టులో అమృత ఇదే అంశంపై పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కేసులో తాను జ‌య కుమార్తెన‌న్న విష‌యాన్ని తేల్చేందుకు సీసీఎంబీ ప‌రీక్ష మీద ఆధార‌ప‌డాల‌ని భావిస్తున్న అమృత‌.. అందులో భాగంగా సీసీఎంబీని సంప్ర‌దించిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. త‌మ‌ను ఎవ‌రూ సంప్రదించ‌లేద‌ని సీసీఎంబీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే.. ఇరువురు వ్య‌క్తుల డీఎన్ఏల ద్వారా.. వారి మ‌ధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే సామ‌ర్థ్యం.. ప‌రిక‌రాలు సీసీఎంబీ ద‌గ్గ‌ర అందుబాటులో ఉన్నాయి. మ‌రి.. జ‌య‌ల‌లిత‌కు సంబంధించిన డీఎన్ఏను సేక‌రించేది ఎలా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. దీనికి స‌మాధానంగా.. మ‌ర‌ణించిన జ‌య‌ల‌లిత డీఎన్ ఏ సేక‌రించ‌కున్నా.. ఆమె ద‌గ్గ‌ర బంధువుల ర‌క్త న‌మూనాల్ని ఆధారంగా చేసుకొని కూడా డీఎన్ ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించొచ్చ‌ని చెబుతున్నారు. అమృత కేసును ప‌రిష్క‌రించ‌టం చాలా సులువుగా చెబుతున్నారు. అమ్మ తోడ‌బుట్టిన వారి ర‌క్త న‌మూనాల‌తో డీఎన్ సేక‌రించి.. స‌రిపోల్చ‌టం చాలా తేలికైన అంశంగా ట్రూత్ ల్యాబ్స్ డైరెక్ట‌ర్ గాంధీ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అమృత ఎపిసోడ్ ను తేల్చ‌టం క‌ష్ట‌మ‌ని భావిస్తున్న వేళ‌.. అది చాలా సులువ‌ని చెబుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.