Begin typing your search above and press return to search.

ఈసారి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ లో అలా చేస్తే చ‌ర్య‌లేన‌ట‌!

By:  Tupaki Desk   |   26 March 2019 4:57 AM GMT
ఈసారి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ లో అలా చేస్తే చ‌ర్య‌లేన‌ట‌!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అధికార నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్ ను వినియోగించే తీరుపై ఎన్నిక‌ల సంఘం విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవ‌ల కాలంలో ప్ర‌గ‌తిభ‌వ‌న్ ను పార్టీ కార్య‌క‌లాపాల‌కు వినియోగిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు రావ‌టం తెలిసిందే. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. కోడ్ అమ‌ల్లో ఉన్న సంద‌ర్భంలో.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ ను పార్టీ పనుల కోసం వినియోగించ‌కూడ‌దు.

అయితే.. ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘించిన‌ట్లుగా ప‌లువురు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందిస్తూ.. ఏం చేస్తున్నార‌న్న విష‌యంపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని వివ‌ర‌ణ కోరింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు టీఆర్ ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖ రాసిన‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్ కుమార్ పేర్కొన్నారు.

ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో పార్టీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా త‌మ‌కు వ‌చ్చిన ఫిర్యాదుకు స్పందించామ‌ని.. మ‌రోసారి ప్ర‌భుత్వ భ‌వ‌నాల్ని పార్టీల కోసం వాడితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప్ర‌చారంలో భాగంగా త‌లెంగాణ పాకిస్థాన్ అవుతోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ పైన స్పందించారు.

ప్ర‌భుత్వ పాల‌న‌పై చేసిన విమ‌ర్శ కావ‌టంతో ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కింద‌కు రాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు త‌ప్పంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి బ్రేక్ ప‌డిన‌ట్లైంది. ఇక‌.. నిజామాబాద్ లోక్ స‌భ స్థానానికి నామినేష‌న్లు వేసేందుకు ఒక వీఐపీ వ‌స్తే రైతుల‌ను బ‌య‌ట‌కు పంపారన్న ఆరోప‌ణ‌ల‌పై వీడియో ఫుటేజీని ప‌రిశీలించామ‌ని.. అలాంటిదేమీ లేద‌ని తేలిన‌ట్లు ర‌జ‌త్ కుమార్ స్ప‌ష్టం చేశారు.