Begin typing your search above and press return to search.

ప్రముఖులకు రోడ్లే శాపం

By:  Tupaki Desk   |   29 Aug 2018 4:36 PM GMT
ప్రముఖులకు రోడ్లే శాపం
X
తెలుగు రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాలు ప్రముఖుల కుటుంబాలకు శాపంగా మారాయి. తెలుగు రాష్ట్రం విడిపోక ముందు - విడిపోయిన తర్వాత ప్రముఖులకు రోడ్లు మ్రుత్యు వాహికలవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలలో యువకుల నుంచి
లబ్ద ప్రతిష్టల వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలు ఆయా కుటుంబాలనే కాదు, తెలుగు ప్రజలను కూడా కలచి వేస్తున్నాయి. ప్రముఖ హస్యనటుడు బాబుమోహన్ కుమారుడు పవన్ కుమార్నుంచి నేటి ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు హరిక్రిష్ణ వరకూ రోడ్డు ప్రమాద మరణాలు ఆందోళన పరుస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాద మరణాలలో తెలగుదేశం పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది ఉండడం ఆ పార్టీకి విషాదమే. 2003 అక్టోబర్ నెలలో ప్రముఖ హస్యనటుడు బాబుమోహన్ తనయుడు 26 సంవత్సరాల పవన్ కుమార్ మరణించారు. ఇది బాబుమోహన్‌ను మానసీకంగా కలచి వేసింది. కుమారుని మరణం తర్వాత బాబు మోహన్ కోలుకోవడానికి చాల కాలమే పట్టింది. ఆ తర్వాత ప్రముఖ విలన్ - క్యారక్టర్ నటుడు కోట శ్రీనివాస రావు తనయుడు కోట ప్రసాద్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. అప్పటికే వయోభారంతో ఉన్న కోట శ్రీనివాస రావును మరింత క్రుంగ తీసింది. కోట శ్రీనివాస రావు కూడా ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. ప్రముఖ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ అజారుద్దిన్ కుమారుడు అయాజుద్దీన్ కూడా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూసారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. వీరంతా యువకులే కావడం, అద్భుత భవిష్యత్తు ఉందనుకుంటున్న సమయంలో మ్రుత్యువాత పడడం ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది.

తెలుగుదేశం నాయకులు ఇంద్రా రెడ్డి, - ఎర్రం నాయుడు, నాటి వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభ నాగిరెడ్డి, నేడు హరిక్రిష్ణ కూడా రోడ్డు ప్రమాదాలలోనే మరణించడం విషాదం. ఈ మరణాలకు కొందరి స్వయంక్రుతాపరాధం కొంత కారణమైతే డ్రైవర్ల నిర్లక్ష్యం కొంత కారణంగా కనిపిస్తోంది. అలుపెరుగని పర్యటనలు, నిద్రలేని రాత్రులు అభిమానులను కలవాలనే ఆత్రుత వీరి మరణానికి కారణంగా తెలుస్తోంది.