Begin typing your search above and press return to search.

ప్రకటనల్లో తేడావస్తే సెలబ్రిటీలకు జైలు!

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:13 AM GMT
ప్రకటనల్లో తేడావస్తే సెలబ్రిటీలకు జైలు!
X
టీవీ ఆన్ చేసినా - పత్రికలు చూసినా - రోడ్లపైకి వచ్చినా ఎదురుగా కనిపించేవి ప్రముఖ కంపెనీల ప్రోడక్టులు - వాటిని చేతపట్టి నిలబడే సెలబ్రెటీల ఫోటోలు - ఫ్లెక్సీలు దర్శనమిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో కంపెనీల మధ్య ఉండే పోటీ కారణంగా ఈ వాణిజ్య ప్రకటనల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ ప్రకటనల్లో కనిపించే ప్రముఖ వ్యక్తులు - సెలబ్రెటీలు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడనుంది. ప్రజలను - వినియోగదారుడిని తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో ఈ సెలబ్రెటీలు నటించినట్లయితే రూ. 50లక్షల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలుశిక్ష కూడా విధించాలని కొత్త ముసాయిదా చట్టం చెప్తొంది!

ముప్పై ఏళ్ల కిందట అంటే 1986లో వచ్చిన వినియోగదారుల చట్టాన్ని తొలగించి, గత ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు - 2015ను లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిని అధ్యయనం చేసిన వినియోగదారుల మంత్రిత్వశాఖ.. ప్రకటనల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే అంశాలుంటే అందుకు సెలబ్రిటీలను బాధ్యులను చేయటం - కల్తీకి పాల్పడితే కఠిన శిక్ష విధించటం వంటి కొన్ని కీలక సిఫారసులను ఆమోదించింది. ఇక ఈ బిల్లు కేబినెట్ ఆమోదం పొందడమే ఆలస్యంగా కనిపిస్తుంది. అదే పూర్తయితే ఇక సెలబ్రెటీలు ఆచి తూచి ప్రకటనల్లో పాల్గొనవలసి ఉంటుంది.

ఈ బిల్లు ప్రకారం బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖులకు.. ఆయా ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ.10 లక్షల జరిమానా తో పాటు రెండేళ్ల జైలు శిక్ష.. రెండోసారి లేదా ఆపైన అదే నేరానికి పాల్పడితే రూ. 50 లక్షల జరిమానా - ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని నిబంధనలు వెలువడనున్నాయని తెలుస్తుంది. ఇక కల్తీ విషయంలో కూడా బ్రాండ్ అంబాసిడర్ కి శిక్షలు ఉండటంతోపాటు - ఆ కంపెనీ లెసైన్స్ రద్దు చేయటం వంటి చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ బిల్లుకు సిఫార్సులు చేరుతున్నాయట.

కాగా, దేశంలో వినియోగదారుడు తమ హక్కుల్ని కాపాడుకునేందుకు 1986వ సంవత్సరంలో వినియోగదారులు రక్షణ చట్టం వచ్చింది. కొనుగోలు చేసిన వస్తువు నాణ్యతగా లేకపోతే మోసపోయామని బాధపడటం - ఆ కంపెనీ వాడిని తిట్టుకోవడం వంటివి చేసి ఊరుకోకుండా... కొనుగోలులో మోసపోతే ఆ వస్తువుకు చెల్లించిన ధరను తిరిగి రాబట్టుకునే వెసులు బాటు ఉంది. ఈ చట్టం వినియోగదారులకు ఆ హక్కును కల్పించింది. అందుకే ప్రతిఏటా డిశంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుతారు.