Begin typing your search above and press return to search.

ఆందోళనకారులకు మద్దతుగా సెలబ్రిటీలు

By:  Tupaki Desk   |   14 April 2022 5:23 AM GMT
ఆందోళనకారులకు మద్దతుగా సెలబ్రిటీలు
X
గడచిన ఐదు రోజులుగా శ్రీలంకలో జరుగుతున్న ప్రజాందోళనలకు మద్దతుగా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు రంగంలోకి దిగారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే+ఆయన కుటుంబ సభ్యులు రాజీనామాలు చేయాలనే డిమాండ్ తో దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశ రాజధాని కొలంబోలోని అధ్యక్ష భవనానికి సమీపంలో ఆందోళనకారులు ఉద్యమం చేస్తున్నారు.

పోలీసులు లాఠీ చార్జి చేసినా, బాష్పవాయువు ప్రయోగించినా ఆందోళనకారులైతే వెనక్కు తగ్గటం లేదు. దేశం అప్పుల్లో కూరుకుపోయింది. అభివృద్ధి లేక, సంక్షేమ పథకాలు అమలు కాక జనాలు నానా అవస్థలు పడుతున్నారు. కిలో పాలపొడి రు. 1500పై మాటే అంటే ఆశ్చర్యంగా ఉంది. వంట గ్యాస్ సిలిండర్ ధర సుమారు 5 వేల రూపాయలు పెట్టినా దొరకటం లేదు. పాలు, పెరుగు, పప్పులు, ఉప్పులు, బియ్యం ధరలు కూడా ఆకాశానికి ఎగబాకేశాయి. పెట్రోలు, డీజిల్ గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు.

దేశం మొత్తం మీద రోజుకు 17 గంటలపాటు కరెంటే ఉండటం లేదు. కరోనా ప్రభావం కొంత దేశాధ్యక్షుడు రాజపక్సే తో పాటు ఆయన కుటుంబసభ్యులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే దేశంలో పరిస్ధితులు దిగజారిపోయాయి.

దీంతోనే విదేశాల నుండి తీసుకున్న అప్పులను చెల్లించలేమని దివాలా ప్రకటించేసింది ప్రభుత్వం. దీంతో ఆందోళనలు మరింత పెరిగిపోయింది. ఆందోళనలకు మద్దతుగా సినీరంగం, ఆర్టిస్టులు, క్రీడలతో పాటు వివిధ రంగాల్లోని సెలబ్రిటీలంతా ఆందోళనకారులకు మద్దతుగా రంగంలోకి దిగారు.

ప్రముఖ క్రికెటర్ రోషన్ మహానామతో పాటు అనేకమంది సినీ ప్రముఖులు, ఆర్టిస్టులు అధ్యక్ష భవనం ముందు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఎప్పుడైతే సెలబ్రిటీలు కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారో వెంటనే ఆందోళనలు ఊపందుకున్నాయి.

మొదట్లో కొలంబోకు మాత్రమే పరిమితమైన ఆందోళనలు ఇపుడు దేశవ్యాప్తంగా అంటుకుంటున్నాయి. చర్చలకు రావాలని ఆందోళనకారులను ప్రధానమంత్రి మహీంద రాజపక్సే పిలిచినా ఎవరు వెళ్ళలేదు. రాజపక్సేతో పాటు ఆయన కుటుంబసభ్యులంతా రాజీనామాలు చేయాల్సిందే అనే ఏకైక డిమాండ్ తోనే ఆందోళనలు జరుగుతున్నాయి.