Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ - హ‌రీశ్‌ - చిరంజీవి..అంతా క్యూ క‌ట్టేశారు

By:  Tupaki Desk   |   7 Dec 2018 5:11 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌ - హ‌రీశ్‌ - చిరంజీవి..అంతా క్యూ క‌ట్టేశారు
X
తెలంగాణలో ఈ ఉదయం నుంచి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఉదయం నుంచి క్యూలైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు సమస్యాత్మక నియోజకవర్గాల్లో(13) సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ను చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,80,64,684 మంది. వీరిలో పురుష ఓటర్లు 1,41,56,182 మంది.. మహిళా ఓటర్లు 1,39,05,811 మంది. ట్రాన్స్‌ జెండర్ ఓటర్లు 2,691 మంది. అత్యధికంగా నగరంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5,75,541 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,37,319 మంది ఓటర్లు ఉన్నారు.

- తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ రాజానగర్‌ పోలింగ్ బూత్‌ లో ఉదయాన్నే ఓటు వేశారు.

- రాష్ట్రమంత్రి - టీఆర్ ఎస్ నేత హ‌రీశ్‌ రావు సిద్ధిపేట‌లో త‌న స‌తీమ‌ణితో క‌లిసి ఓటువేశారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

- తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రో. కోదండరామ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ తార్నాకలోని 180 నెం పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేశారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే అందరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు,

- హిమాయత్ నగర్ లోనీ సెయింట్ అంతోనిస్ హై స్కూలు లో తన ఓటు హక్కును మంత్రి కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమ వినియోగించుకున్నారు.

-- మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామ్ చరణ్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాలేదు. సాయంత్రం లోపు రామ్ చరణ్ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారని సమాచారం. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కును అందరూ వినియోగించుకోవడాని కోరారు.

- సినీ ప్ర‌ముఖులు వెంకటేష్ - నాగార్జున - అల్లు అర్జున్ లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

-కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్ధిగా బరిలో ఉన్న నందమూరి సుహసిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెహదీపట్నంలో ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే వచ్చి ఓటు వేశారు. అనంతరం తను పోటీ చేస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గానికి బయలు దేరారు.

- ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ ముగిసిన తరువాత అందరు ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పిన రాజమౌళి ఈ ఉదయం జూబ్లీహిల్స్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ - పోలింగ్ బూత్ నెంబర్ 19 లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా - రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ఓటు గల్లంతు కావడంతో ఓటు వేయకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు.