Begin typing your search above and press return to search.

నెహ్రూ మరణంపై ఎవరేమన్నారు

By:  Tupaki Desk   |   17 April 2017 9:56 AM GMT
నెహ్రూ మరణంపై ఎవరేమన్నారు
X
విజయవాడకు చెందిన సీనియర్ నేత - మాజీ మంత్రి దేవినేని నెహ్రు మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం వేకువన మృతిచెందిన సంగతి తెలిసిందే. దేవినేని నెహ్రు 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో చీలిక వచ్చిన సమయంలో ఆయన ఎన్టీఆర్‌ వైపు నిలిచారు. ఎన్టీఆర్ మరణం తర్వాత కాంగ్రెస్‌ లో చేరారు. ఏడాది క్రితమే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరారు.

నెహ్రూ మృతిపట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు. నెహ్రూ మృతి పార్టీకి - వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. మంత్రిగా - ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు అనేక సేవలు అందించారని అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ - మంత్రులు నారా లోకేశ్ - ప్రత్తిపాటి పుల్లారావు - ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు కూడా తమ సంతాపం తెలిపారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నెహ్రు మృతికి సంతాపం తెలిపారు. దేవినేని అవినాష్‌ కు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాడసానుభూతి తెలియజేశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.

మరోవైపు ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ అయితే ఆస్పత్రిలో దేవినేని భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేశారు. నెహ్రుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకున్న ఆప్త మిత్రుల్లో నెహ్రూ ఒకరని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి తనకు బాధను కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు షిర్డీ సాయిబాబా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ - తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, దేవినేని నెహ్రూ మరణం రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని - తాను ఆయన్ను మరచిపోలేనని చెప్పాడు. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు.

తన తాజా చిత్రం 'వంగవీటి'లో ఓ హీరో అయిన దేవినేని నెహ్రూ మరణంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. "నెహ్రూ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో నేను గడిపిన అద్భుత సమయాన్ని గుర్తు చేసుకుంటున్నా. బలమైన నేరారోపణలతో కూడిన శక్తికి ఆయన చిహ్నం" అని వర్మ ట్వీట్ చేశారు.

ఎన్టీ రామారావు ఆశీస్సులతో అప్పట్లో యువకులుగా ఉన్న దేవినేని నెహ్రూ - కంభంపాటి రామ్మోహన్ రావు - కోడెల శివప్రసాద్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కంభంపాటి మాట్లాడుతూ ‘‘నెహ్రూ ఓ యువకుడుగా నాడు విద్యార్థి సంఘాలు పెట్టారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీలోకి వచ్చారు... ఎన్నో అవాంతరాలను అధిగమించి ఒక నాయకుడిగా దేవినేని నెహ్రూ ఎదగడమనేది అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం, నెహ్రూను నేను కలిశాను. పార్టీ, పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను ప్రస్తావించాను. సుదీర్ఘంగా చర్చించాను. నెహ్రూ కుటుంబంతో కలిసి భోజనం కూడా చేసి వచ్చాను... నవ్వుతూ ప్రతిఒక్కరినీ పలకరించే వ్యక్తి నెహ్రూ. ఈ వారసత్వాన్ని దేవినేని కుమారుడు అవినాష్ ముందుకు తీసుకువెళ్లాలి’’ అన్నారు. నెహ్రూ ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తని.. కనీసం - మంచినీళ్లు కూడా బయట తాగరని - దురలవాట్లు లేవని.. సాయంత్రానికి ఇంటికి చేరి, ఏడున్నర కల్లా భోజనం చేసి పడుకునే వ్యక్తని అని కంభంపాటి చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ కు నెహ్రూ అంటే ఎంతో అభిమానమని, ఎన్టీఆర్ ను నెహ్రూ దైవంగా పూజించేవారని.. రాజకీయాల్లో తాము అన్నదమ్ముల్లా కలిసి పనిచేశామని, అనేక ఆటు పోట్లు ఎదుర్కొన్నామని నాటి విషయాలను స్పీకర్ కోడెల గుర్తు చేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/