Begin typing your search above and press return to search.

సెల‌బ్రిటీలు సామాన్యులుగా మారిన వేళ‌

By:  Tupaki Desk   |   2 Feb 2016 9:30 AM GMT
సెల‌బ్రిటీలు సామాన్యులుగా మారిన వేళ‌
X
మారిన కాలానికి త‌గ్గ‌ట్లుగా ప‌రిస్థితుల‌తో పాటు.. ప్ర‌ముఖుల మైండ్ సెట్‌లో చాలానే మార్పు వ‌చ్చిన విష‌యం తాజాగా బ‌య‌ట‌కొచ్చింది. గ‌తంలో ఓటేసేందుకు ఎవ‌రైనా ప్ర‌ముఖులు వ‌చ్చారంటే.. ముందు వారిని ఓటేసేలా అవ‌కాశం క‌ల్పించేవారు. అధికారుల‌తోపాటు.. మిగిలిన వారు సైతం సెల‌బ్రిటీల‌కు అమిత ప్రాధాన్య‌త ఇచ్చేవారు. గ‌త కొద్ది సంవ‌త్స‌రాల్లో ఇలాంటి వైఖ‌రిలో చాలానే మార్పు వ‌చ్చింది. ఆ మార్పు ఎంత న్న‌ది తాజా గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

సినిమా.. రాజ‌కీయ‌.. పారిశ్రామిక వ‌ర్గాల‌కు చెందిన ప‌లువురు హైద‌రాబాదీయులు సింప్లిసిటీకి ప్రాధాన్య‌త ఇచ్చారు. తామేమీ ప్ర‌త్యేకం కాద‌ని.. అంద‌రిలానే తాము అన్నట్లే వ్య‌వ‌హ‌రించారు. హ‌డావుడి లేకుండా వ‌చ్చిన వారు.. పోలింగ్‌ కేంద్రాల్లో ర‌ద్దీ లేకుంటే నేరుగా వెళ్లి ఓటేశారు. కొన్నిచోట్ల మాత్రం ర‌ద్దీ ఉండ‌టంతో.. క్యూలో నిలుచున్నారు. ఓటేందుకు ఆల‌స్య‌మైనా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌మ‌కు అవ‌కాశం వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేసి మ‌రీ ఓటు వేయ‌టం క‌నిపించింది.

మ‌రోవైపు.. అద‌నంత దూరాన ఉంటే ప్ర‌ముఖులు త‌మ క‌ళ్ల ముందుకొచ్చి.. త‌మ ఓటుకు సంబంధించిన ప‌త్రం తీసుకోవ‌టం.. పుస్త‌కంలో సంత‌కం చేయ‌టం లాంటివి చేయ‌టం లాంటివి త‌మ క‌ళ్ల ముందే జ‌ర‌గ‌టం పోలింగ్ సిబ్బందిని విప‌రీత‌మైన ఆనందాన్ని క‌లిగించింది. త‌మ విధుల్నికాస్త ప‌క్క‌న‌పెట్టి.. త‌మ సెల్‌ ఫోన్ల‌లో బంధించేందుకు ఎన్నిక‌ల సిబ్బంది ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు. ఇలాంటివి ప్ర‌ముఖుల‌కు మామూలే కావ‌టంతో వారంతా న‌వ్వుతూ ఓకే చెప్పేశారు. ఏమైనా గ్రేట‌ర్ ఎన్నిక‌ల వేళ‌..సెల‌బ్రిటీలు సైతం సామాన్యులుగా వ్య‌వ‌హ‌రించ‌టం అంద‌రిని ఆక‌ట్టుకునేలా చేసింది.