Begin typing your search above and press return to search.

సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు పెద్దపీట

By:  Tupaki Desk   |   11 Sep 2015 12:06 PM GMT
సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు పెద్దపీట
X
ఉద్యమ సమయంలో సీమాంధ్ర పారిశ్రామికవేత్తలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు తూలనాడినా.. తెలంగాణ వచ్చిన తర్వాత.. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు కూడా పెద్దపీట వేస్తానని పదే పదే స్పష్టం చేశారు. చెప్పినట్లే ఆయన కేవలం తెలంగాణ పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాకుండా సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఆయన చైనా పర్యటనలో తొలి పారిశ్రామిక ఒప్పందం సీమాంధ్ర పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకోవడమని పారిశ్రామిక వర్గాలు వివరిస్తున్నాయి.

పారిశ్రామివేత్తలకు డబ్బే కులమని, వారికి కుల మతాలు ఉండవని చెబుతారు. కానీ, తెలంగాణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు ప్రాంతాన్ని చూడాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న సెల్ కాన్ యజమానులు బాలుచౌదరి, గురు తదితరులు నవ్యాంధ్రలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. తొలుత బిగ్ సిని స్థాపించిన వాళ్లు.. ఆ తర్వాతి కాలంలో సెల్ కాన్ కంపెనీని ఏర్పాటు చేశారు. దాని ద్వారా దేశీయంగా సెల్ ఫోన్ లను తయారు చేశారు. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు బడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చైనా వెళ్లిన బృందంలోనూ చోటు సంపాదించారు. అంతేనా.. కేసీఆర్ చైనా పర్యటనలో తొలి ఒప్పందం కూడా వారిదే కావడం విశేషం. దాదాపు రూ.120 కోట్ల ఒప్పందం సెల్ కాన్ సొంతమైంది. హైదరాబాద్ లో ఎల్ ఈడీ టీవీల తయారీకి సంబంధించిన ఈ ఒప్పందానికి చైనా కంపెనీతో సంతకాలు చేశారు.

సీమాంధ్రకు చెందిన సెల్ కాన్ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, అందువల్ల మిగిలిన పారిశ్రామికవేత్తలు కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఇక్కడి వారి ఆస్తుల విషయంలోనూ ఆందోళన అవసరం లేదని టీఆర్ఎస్ వర్గాలు వివరిస్తున్నాయి.