Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ :మొబైల్ టవర్లు తగలబెడుతున్న ప్రజలు..?

By:  Tupaki Desk   |   9 April 2020 10:10 AM GMT
కరోనా ఎఫెక్ట్ :మొబైల్ టవర్లు తగలబెడుతున్న ప్రజలు..?
X
కరోనా మహమ్మారి ఒకవైపు ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే ..మరోవైపు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫేక్ న్యూస్ వల్ల కొందరు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ టవర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది అని సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మిన ప్రజలు మొబైల్ టవర్లను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటివరకు పదికి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో అప్‌ లోడ్ చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఈ ఘటన యూకే లో జరిగింది.

కరోనా వైరస్ వల్ల అమెరికాతోపాటు యూకే, ఐరోపా దేశాలు విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. కరోనాను అడ్డుకొనేందుకు ఆయా దేశాల్లో కూడా లాక్‌ డౌన్ ను విధించాయి. అయితే, యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రజలు 5G మొబైల్ టవర్లపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్‌ గా మారాయి. దీంతో పోలీసులు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అసలు ప్రజలు సిగ్నల్ టవర్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు?4G కంటే మరింత మెరుగైన నెట్‌ వర్క్ అందించేందుకు యూకేలోని మొబైల్ సంస్థలు 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. అయితే, ఈ అత్యాధునిక టెక్నాలజీకి కరోనా వైరస్‌ ను సైతం ఆకర్షించే శక్తి ఉంటుందని, ఈ సిగ్నల్స్ ద్వారా కరోనా వ్యాపిస్తోందని కొందరు ప్రచారం చేశారు.

ఆ వార్తలని నమ్మిన ప్రజలు 5G మొబైల్ టవర్లపై దాడులు చేయడం మొదలుపెట్టారు. వాటిని తగలబెడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే , ఆకతాయిలు ధ్వంసం చేస్తున్న మొబైల్ టవర్లకు మరమ్మతులు చేయడానికి వెళ్తున్న నెట్‌ వర్క్ సిబ్బంది పై కూడా దాడులకి దిగుతున్నారు. దీంతో యూకే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనలను ఖండిస్తూ యూకే మొబైల్ నెట్‌ వర్క్ ఆపరేటర్లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 5జీ నెట్‌ వర్క్ ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం నిజం కాదు అని , ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు.