Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్ పై కేంద్రం ఆగ్ర‌హం.. మ‌ళ్లీ ఏమైందంటే?

By:  Tupaki Desk   |   22 July 2021 2:30 PM GMT
ట్విట్ట‌ర్ పై కేంద్రం ఆగ్ర‌హం.. మ‌ళ్లీ ఏమైందంటే?
X
భార‌త‌ కేంద్ర ప్ర‌భుత్వం - సామాజిక మాధ్య‌మం ట్విట‌ర్ మ‌ధ్య కొన‌సాగుతున్న‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇండియాలో ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ పై ఆంక్ష‌లు ఉన్నాయంటూ ట్విటర్ వ్యాఖ్యానించడంపై కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ట్విట‌ర్ త‌న స‌మ‌స్య నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకే.. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అంటూ మాట్లాడుతోంద‌ని వ్యాఖ్యానించింది.

ఈ మేర‌కు కేంద్ర ఐటీ శాఖ స‌హాయ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ పార్ల‌మెంటులో మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త ఐటీ రూల్స్ నుంచి తప్పించుకునేందుకే.. భారత్ లో భావప్రకటన స్వేచ్ఛతోపాటు ఉద్యోగుల భ‌ద్ర‌త అంశాన్ని ట్విట‌ర్ తెర‌పైకి తెస్తోంద‌ని మంత్రి అన్నారు. వ్య‌క్తుల భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు రాజ్యాంగ‌మే గ్యారంటీ ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆ స్వేచ్ఛ‌ను ఏదో ఒక సంస్థ నియంత్రించ‌డం సాధ్యం కాద‌ని మంత్రి తేల్చి చెప్పారు. అదేవిధంగా దేశంలో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం, ఇంంట‌ర్నెట్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని కూడా మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ క్లారిటీ ఇచ్చారు.

దేశంలోని ప్ర‌తి చ‌ట్టాన్నీ ట్విట‌ర్ అమ‌లు చేయాల్సిందేనని అన్నారు. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ పేరుతో ట్విట‌ర్ చెబుతున్న అభ్యంత‌రాల‌ను అంగీక‌రించ‌లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న ఐటీ చ‌ట్టంతోపాటు, మ‌రే ఇత‌ర చ‌ట్టాలు కూడా ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ కు భంగం క‌లిగించేవి కావ‌ని చెప్పారు. మిగిలిన సోష‌ల్ మీడియా మాధ్య‌మాల‌తోపాటుగా ట్విట‌ర్ కూడా అన్ని నిబంధ‌న‌లూ అంగీక‌రించాల్సిందేన‌ని మంత్రి మ‌రోసారి తేల్చి చెప్పారు.