Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఛోటా నేత దెబ్బకు కేసీఆర్ సర్కారును నివేదిక కోరిన కేంద్రం

By:  Tupaki Desk   |   10 Sep 2022 9:30 AM GMT
టీఆర్ఎస్ ఛోటా నేత దెబ్బకు కేసీఆర్ సర్కారును నివేదిక కోరిన కేంద్రం
X
తొందరపాటు అస్సలు పనికి రాదు. అత్యుత్సాహంతో చేసే పనులు కొత్త సమస్యలకు దారి తీస్తాయి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మహా నిమజ్జన కార్యక్రమానికి అసోం సీఎం హేమంత బిశ్వశర్మ వద్దకు దూసుకొచ్చిన టీఆర్ఎస్ ఛోటా నేత తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో సొంత పార్టీ సర్కారుకు తలనొప్పిగా మారింది.

ఎంజే మార్కెట్ వద్ద జరిగిన కార్యక్రమానికి హాజరైన అసోం సీఎం వేదిక మీద ఉన్న వేళలో.. టీఆర్ఎస్ ఛోటా నేత నందు బిలాల్ వ్యాస్ స్టేజ్ పైకి దూసుకురావటం.. మైకును లాక్కునే ప్రయత్నం చేయటం తెలిసిందే.

తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన ఈ ఉదంతంపై తాజాగా కేంద్రం స్పందించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి.. అది కూడా జెడ్ ప్లస్ సెక్యురిటీ ఉండే ప్రముఖుడికి సెక్యూరిటీ లోపం తలెత్తిందని.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరణ కోరింది.

తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దీనిపై త్వరలోనే రాతపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో అసోం ప్రభుత్వం.. సీఆర్ పీఎఫ్ సైతం ఇదే విషయమైన తెలంగాణ హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

అసోం ముఖ్యమంత్రి వద్దకు దూసుకెళ్లి.. మైకు లాక్కునే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ నేతను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో సీఎం కేసీఆర్ ను దూషించినందుకే ఆయన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.

తమ నేతను రెచ్చగొట్టేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి క్రిశాంక్ మన్నె తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక మీద హిమంత బిశ్వ శర్మ ఉన్నారని.. రోజంతా తమ ముఖ్యమంత్రిని తిట్టారని.. అందుకే కేసీఆర్ కు రాష్ట్రప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలంటూ కొత్త పాయింట్ తెర మీదకు తీసుకొచ్చారు. ఈ ఉదంతంపై బీజేపీ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.