Begin typing your search above and press return to search.

కేంద్రం చేతులెత్తేసిందా ?

By:  Tupaki Desk   |   22 Dec 2021 5:30 AM GMT
కేంద్రం చేతులెత్తేసిందా ?
X
తెలుగురాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం విషయంలో నరేంద్రమోడి సర్కార్ చేతులెత్తేసినట్లే ఉంది. వివాదం ఏదైనా కానీండి రెండు తెలుగు రాష్ట్రాలే సామరస్యపూర్వకంగా కూర్చుని మాట్లాడుకోండి, పరిష్కరించుకోండనే ఉచిత సలహాలు పడేస్తోంది. అంటే అర్ధమేంటంటే వివాదాల పరిష్కారంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేంద్రం చెప్పకనే చెబుతోంది. తాజాగా విద్యుత్ బకాయిల చెల్లింపు వివాదాన్ని కూడా రెండు రాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకోవాలని కేంద్రం చెప్పేసింది.

విచిత్రమేమిటంటే ఆమధ్య జల వివాదాలను కూడా రెండు రాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకోమని సూచించింది. అసలు రెండు రాష్ట్రాలు కూర్చుని సమస్యలను పరిష్కరించుకునేట్లయితే కేంద్రం దగ్గరకు ఎవరు వెళతారు ? తమ స్ధాయిలో సమస్యలు పరిష్కారం కాకపోయినపుడే తెలుగు రాష్ట్రాలు కేంద్రం దగ్గర పంచాయితి పెడుతున్నాయి. ఈ పంచాయితీలో కూడా కేసీయార్ చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో విధంగా స్టాండ్ తీసుకుంటున్న కారణంగానే సమస్యలు పరిష్కారం కావటంలేదు.

తెలంగాణాలోని నీటి ప్రాజెక్టుల్లో అనుమతులు లేని ప్రాజెక్టులున్నా అదే ఫిర్యాదును ఏపీ విషయంలో చేస్తున్నారు. ఇక విద్యుత్ బకాయిలు కూడా రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణా నుండి సుమారు రు. 4 వేల కోట్ల దాకా ఏపీకి రావాల్సుంది. నిజానికి విభజన హామీల విషయంలో కేసీయార్ అమలు చేయటం తప్ప చేయగలిగిందేమీలేదు. అయినా తనిష్టం ప్రకారం వ్యవహరిస్తు విభజన చట్టాన్ని తుంగలో తొక్కేస్తున్నారు. దాంతో ఏ సమస్య కూడా పరిష్కారం కావటంలేదు.

ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ చాలా ఆతృతపడుతోంది. ఇందులో భాగంగానే వివాదాల పరిష్కారంలో ఏపీకి అనుకూలంగా మాట్లాడాల్సొస్తే అది తెలంగాణాలో తనకు ఎక్కడ ఇబ్బంది అవుతుందేమో అని బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. తల్లకిందులుగా తపస్సు చేసినా ఏపీలో నాలుగు సీట్లు గెలిచేది కూడా చాలా ఎక్కువే. అందుకనే ఏపీని నిర్లక్ష్యం చేస్తు, తెలంగాణాకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పలేక సమస్యలను గాలికొదిలేస్తున్నది కేంద్రం.