Begin typing your search above and press return to search.

కేంద్రం సంచలన నిర్ణయం.. 18 ఏళ్ల లోపు వారికి రూ.5 లక్షలు

By:  Tupaki Desk   |   6 Aug 2021 10:00 AM GMT
కేంద్రం సంచలన నిర్ణయం.. 18 ఏళ్ల లోపు వారికి రూ.5 లక్షలు
X
భారతదేశంలో గత ఏడాదిన్నరకి పైగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్‌ డౌన్‌ ఆంక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కారణంగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనాథ పిల్లల ప్రయోజనాల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా అనాథలైన 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్ తో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, దాని ప్రీమియం పీఎం కేర్స్‌ ద్వారా చెల్లించ బడుతుందని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇద్దరిని కోల్పోయిన 18 సంవత్సరాల వయసున్న పిల్లలు నెలవారీ స్టైఫండ్‌ అందుకుంటారని కేంద్ర మంత్రి తన ట్వీట్‌తో తెలిపారు. ఇక 23 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి రూ.10 లక్షలు మొత్తం ఇవ్వబడుతుందని తెలిపారు.

కాగా, పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ స్కీమ్‌ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 29, 2021న ప్రారంభించారు. మార్చి 11, 2020 నుంచి కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న వారు కోల్పోయినట్లతే అలాంటి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో భాగంగా తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి పిల్లవాడికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. అంతే కాదు.. పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు వారికి ప్రతినెలా స్టైఫండ్ అందిస్తారు. వారికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత పది లక్షల రూపాయల ఫండ్‌ను అందిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను pmcaresforchildren.in ద్వారా పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన సాధారణంగా ప్రతి కుటుంబానికి సుమారు రూ.5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులకు బీమాను అందిస్తుంది. ఈ యోజనకు అర్హులైన కుటుంబాలను వారి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం సుమారు 10.74 కోట్ల కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా ఎంపికయ్యారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న సేవలను కూడా లెక్కిస్తే సుమారు 13. 17 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతున్నారు. ఈ కుటుంబాలన్నీ రూ.5 లక్షల వరకు హాస్పిటలైజేషన్ ఖర్చుల ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ఈ పథకంలో క్యాష్ లెస్, పేపర్ లెస్ సేవలను పొందేందుకు వీలును కల్పించింది ప్రభుత్వం. ఇది వ్యక్తులు హాస్పిటల్‌ లో చేరినప్పుడు వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా కాపాడుతుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోనూ వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు దిగజారకుండా ఈ పథకం ఉపయోగపడుతుంది.