Begin typing your search above and press return to search.

ట్విటర్‌కు కేంద్రం ఫైనల్‌ వార్నింగ్‌

By:  Tupaki Desk   |   5 Jun 2021 9:30 AM GMT
ట్విటర్‌కు కేంద్రం ఫైనల్‌ వార్నింగ్‌
X
మైక్రోబ్లాగింగ్ సంస్థ , ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట‌ర్‌ కు చివ‌రిసారి, క‌ఠిన‌మైన హెచ్చ‌రిక‌ను జారీ చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. కొత్త ఐటీ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని, లేదంటే చ‌ట్ట‌ప‌ర‌మైన ప‌ర్య‌వ‌సానాల‌ను ఎదుర్కోవాల్సిందేన‌ని ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్ స్ప‌ష్టం చేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఐటీకి చెందిన సీనియ‌ర్ అధికారుల‌తో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖా మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ శుక్ర‌వారం ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఆ వ‌ర్గాలు తెలిపాయి.

కొత్త మ‌ధ్య‌వ‌ర్తిత్వ మార్గ‌ద‌ర్శ‌క నిబంధ‌న‌లు గ‌త నెల 26 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. అంత‌కుముందు వీటిని అంగీక‌రించ‌డానికి సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం మూడు నెల‌ల స‌మ‌యం ఇచ్చింది. అయితే ట్విట‌ర్ మాత్రం వీటికి ఇంకా అంగీక‌రించ‌లేదు. ఇండియాలో చీఫ్ కాంప్ల‌యెన్స్ ఆఫీస‌ర్, నోడ‌ల్ కాంటాక్ట్ ప‌ర్స‌న్ గ్రీవియెన్స్ ఆఫీస‌ర్ల‌ను ట్విట‌ర్ ఇంకా నియ‌మించ‌లేదని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

దేశ ఐటీ నిబంధనలను తక్షణమే పాటించేలా ట్విటర్‌ కు నోటీసులిచ్చామని కేంద్రం ప్రకటించింది. ఐటీ నిబంధనల ప్రకారం దేశీయంగా అధికారులను నియమించేందుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇప్పటివరకు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ వివరాలను అందించలేదని ట్విటర్‌కు ఇచ్చిన నోటీసులో కేంద్రంపేర్కొంది. నామినేట్ చేసిన రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ అండ్‌ నోడల్ కాంటాక్ట్ పర్సన్ ట్విటర్‌ ఉద్యోగి కాదని కూడా హైలైట్ చేసింది. అలాగే ట్విటర్‌ చిరునామా నిబంధనల ప్రకారం కూడా లేదని వ్యాఖ్యానించింది. సరైన సమాచారం అందించలేదని మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిబంధనల అమలు విషయంలో విఫలమైతే ఐటీ చట్టం 2000, సెక్షన్ 79 ప్రకారం లభించే మినహాయింపులను ఉపసంహరించుకుంటామని తెలిపింది. దీని ప్రకారం సంబంధిత పరిణామాలు, జరిమానా చర్యలకు ట్విటర్‌ బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.