Begin typing your search above and press return to search.

800 కోట్లు ఎగ్గొట్టారు.. తెలంగాణ అక్రమ మైనింగ్ పై కేంద్రం ఫోకస్

By:  Tupaki Desk   |   7 Jan 2023 4:19 AM GMT
800 కోట్లు ఎగ్గొట్టారు.. తెలంగాణ అక్రమ మైనింగ్ పై కేంద్రం ఫోకస్
X
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు మరో తేనె తుట్టెను కదిపారు. తెలంగాణలో జరుగుతున్న అక్రమాలపై ఒక్కొక్కటి వెలుగులోకి తీస్తున్న ఈడీ తాజాగా మరో సంచలన విషయం బయటపెట్టింది. ఈ రాష్ట్రం నుంచి చైనా, హాంగాంగ్ తదితర దేశాలకు తరలిన గ్రానైట్ కు సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. తప్పుడు అడ్రస్ లు, విదేశాలకు చెందిన వారి ఖాతాలను పెట్టి 800 కోట్లకు పైగా ప్రభుత్వానికి పన్ను చెల్లించలేదని తెలిపింది. దాదాపు 8 కంపెనీలకు చెందిన వారు ఇందులో ఉన్నారని చెబుతూ వారి వివరాలను సీబీఐకి అందించి విచారించాలని తెలిపింది. ఆ కంపెనీల పేర్లను కూడా ప్రస్తావించడంపై ఇప్పుడు వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది.

కరీంనగర్ లోని గ్రానైట్ కంపెనీల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని కొన్ని రోజుల కిందట ఈడీ, ఐటీ అధికారులు అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోని గ్రానైట్ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో తెలంగాణకు చెందిన ఓ మంత్రి తో పాటు గ్రానైట్ వ్యాపారులను విచారించారు. ఆ తరువాత పలు రికార్డలును స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డుల ఆధారంగా ఈడీ అధికారులు పలు కంపెనీలపై విచారణ చేయాలని సీబీఐకి నివేదిక అందించారు.

ఈ నివేదికలో శ్వేతా ఏజెన్సీ, ఏఎస్ యూ వై షిప్పింగ్, జేఎం బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్ ఫోర్ట్, అరవింద గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, కేవిఏ ఎనర్జీ, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, గాయత్రీ మైన్స్ కంపెనీలపై విచారణ చేయాలని ఈడీ పేర్కొంది.

ఈ కంపెనీలు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి భారీగా గ్రానైట్ ను ఎగుమతి చేశారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి 800 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. చెల్లించలేదని తెలిపింది. అందువల్ల వీటిపై విచారణ చేయాలని తెలిపింది.

గ్రానైట్ కంపెనీల్లో పలు అక్రమాలు జరిగాయని కరీంనగర్ కు చెంది ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్లోని 9 సంస్థలు భారీగా అక్రమాలు చేశాయని సీబీఐ, ఎన్జీటి, కేంద్ర పర్యావరణ శాఖకు ఏడాది కిందట ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఈడీ అధికారులు తనిఖీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఆ తరువాత ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో విచారణకే పరిమితం అయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నివేదికను సీబీఐకి అందించి విచారించాలని తెలపడం ఉత్కంఠగా మారింది.

రాష్ట్రంలో సీబీఐ విచారణను నిలిపివేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఆ కేసు విషయంలో ఇన్వాల్వ్ అయిన సీబీఐ తాజాగా గ్రానైట్ లో అక్రమాలు చోటు చేసుకున్న దానిపై పరిశీలించనుంది. దీంతో ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడుతాయోనని చర్చించుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.