Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్రం స్పెషల్ మిషన్ !

By:  Tupaki Desk   |   25 Aug 2020 12:45 PM IST
కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్రం స్పెషల్ మిషన్ !
X
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో రోజులో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న దేశం మనదేశమే. ప్రతిరోజూ కూడా 60 వేలకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కూడా దశల వారీగా సడలిస్తూ వస్తుండటంతో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇకపోతే దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. అయితే , ఆ పరిశోధనల వేగాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక మిషన్‌ కు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి

రూ.3వేల కోట్ల మూల నిధి (కార్పస్‌ ఫండ్ ‌)తో ‘మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు చేస్తున్న కంపెనీలకు సాంకేతిక వసతులను సమకూర్చడం, ఆర్థిక వనరులను అందించడంతో పాటు సురక్షితమైన, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను చౌకగా ఉత్పత్తి చేయించి దేశ ప్రజలందరికీ చేరవేయడమే ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం. కేంద్ర శాస్త్ర,సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ తుది మెరుగులు దిద్దుకుంటోందని అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఈ మిషన్ కి సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని, రూ.3 వేల కోట్ల బడ్జెట్‌ తో 12-18 నెలల్లోగా కనీసం 6 కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి ప్రక్రియను పూర్తిచేయించి, లైసెన్సింగ్‌ మంజూరు చేసి అత్యవసర వినియోగం కోసం యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లో అందుబాటులోకి తేవాలని మిషన్ లో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఏదైనా కరోనా‌ వ్యాక్సిన్‌ విజయవంతమై, ఆమోదం లభించగానే దేశ ప్రజలకు సరిపడా ఉత్పత్తి చేయించి, సరఫరా చేయించాలని అనుకుంటున్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియను ఆయా ఫార్మా, బయోటెక్నాలజీ కంపెనీల ప్రాజెక్టులుగా కాకుండా దేశానికి అవసరమైన మిషన్‌ గా ముందుకు తీసుకెళ్లాలనేది మిషన్‌ కొవిడ్‌ సురక్ష లక్ష్యం.