Begin typing your search above and press return to search.

కేంద్రం దెబ్బకి దిగొచ్చిన ట్విట్టర్‌... గ్రీవెన్స్‌ అధికారి నియామకం !

By:  Tupaki Desk   |   12 July 2021 1:24 AM GMT
కేంద్రం దెబ్బకి దిగొచ్చిన ట్విట్టర్‌... గ్రీవెన్స్‌ అధికారి నియామకం !
X
దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల అమలు విషయంలో కొన్ని రోజులుగా ససేమిరా అన్న ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐటీ నిబంధనల అమల్లో భాగంగా భారత్‌ లో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి ని తాజాగా నియమించింది. భారత్‌ కు చెందిన వినయ్ ప్రకాశ్‌ కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సంస్థ వెబ్‌ సైట్‌ లో ఆయన వివరాలను తెలిపింది. అందులోని ఈ-మెయిల్ ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని వెల్లడించింది.

గ్రీవెన్స్‌ అధికారుల నియామకంలో జాప్యంపై ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు కూడా గతవారం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. అధికారుల నియామకానికి 8 వారాల గడువు కోరిన విషయం తెలిసిందే. గడువు ముందుగానే ఆర్‌జీవోను నియమించడం గమనార్హం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు 2021 లోని రూల్ 4 (1) (డి)కి అనుగుణంగా 2021 మే 26 నుంచి రిపోర్టింగ్ వ్యవధి కోసం జూలై 11, 2021 న మా ప్రారంభ నివేదికను జూన్ 25న ప్రచురించాం అని ట్రాన్స్‌ పరెన్సీ సెంటర్ పేజ్‌ లో వెల్లడించింది. కొత్త ఐటీ నిబంధనల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఐటీ మార్గదర్శకాలను పాటించడంలో ట్విటర్‌ విఫలమైందని పేర్కొంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ట్విటర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

గ్రీవెన్స్ అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించిన న్యాయస్థానం, ఇంకెంత కాలం పడుతుందని నిలదీసింది. అందుకు 8 వారాల గడువు కోరిన సోషల్ మీడియా దిగ్గజం, వారం రోజుల్లోనే ఆర్‌ జీఓను నియమించింది. నూతన ఐటీ చట్టం మార్గదర్శకాల ప్రకారం 50 లక్షల యూజర్లు దాటిన సోషల్ మీడియాతప్పనిసరిగా ముగ్గురు అధికారులను (ఆర్‌జీఓ, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ అధికారి) నియమించాలి. వారందరూ భారత్‌ లో నివసిస్తూ ఉండాలి. అయితే, 1.75 కోట్ల మేర వినియోగదారులున్న ట్విటర్ నిబంధనలు పాటించని కారణంగా గత నెల మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. దీంతో పలువురు యూజర్లు చేసిన అభ్యంతరకర పోస్టులకు ట్విటర్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల పర్యవేక్షణ జూలై 2021’ పేరిట తొలి కాంప్లియెన్స్‌ నెలవారీ నివేదికను విడుదల చేసింది. దీంట్లో భాగంగా మే 26-జూన్‌ 25 మధ్య 94 ఫిర్యాదులు అందాయని తెలిపింది. 133 యూఆర్‌ఎల్స్‌పై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. ట్విట్టర్‌ ఖాతాలు రద్దు చేయాలన్న 56 ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. పిల్లల పోర్నగ్రఫీకి సంబంధించి 18,385 ఖాతాలు, ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్న మరో 4,179 ఖాతాలను రద్దు చేసినట్టు తెలిపింది.