Begin typing your search above and press return to search.

అమ్మాయిల వివాహ కనీస వయసుపై త్వరలో నిర్ణయం: మోడీ

By:  Tupaki Desk   |   16 Oct 2020 3:50 PM GMT
అమ్మాయిల వివాహ కనీస వయసుపై త్వరలో నిర్ణయం: మోడీ
X
మహిళల పెళ్లి వయసు తక్కువగా ఉండడం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. ఇది గమనించిన మోడీ ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేయిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పురుషులతో అన్నింటా సమానంగా తన జీవన విధానాన్ని మార్చుకున్న మహిళలకు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుందనే విషయాన్ని ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది.

మరో సంచలన నిర్ణయం దిశగా ప్రధాని మోడీ ఆలోచిస్తున్నారా? దేశంలో వివాహ కనీస వయసును పెంచే ఆలోచనలో ఉన్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దేశంలో అమ్మాయిల వివాహ కనీస వయసుపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని ప్రధాని మోడీ తెలిపారు. దీనిపై అధ్యయనం కోసం నియమించిన కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందన్నారు.

అటు గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తొలిసారిగా దేశంలో బాలురతో పోలిస్తే బాలికలు స్కూళ్లలో అధికంగా చేరారని చెప్పారు.

అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి కావడం వల్లే ఎక్కువగా శిశు మరణాలు, మాతృ మరణాలు జరుగుతున్నాయని కేంద్రం భావిస్తోంది. అందుకే వారు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్న దానిపై అధ్యయనం చేసేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఇది వరకు ఏర్పాటు చేసింది.

దేశంలో అనేక రాష్ట్రాలు మాతృ మరణాలపై పురోగతి సాధించినా.. యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. కాగా ఈ వయసును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచాలని కేంద్రం యోచిస్తోంది.పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని చూస్తోంది.