Begin typing your search above and press return to search.

అభివృద్ధి చేస్తాం.. సహకరించండి, సీఎం జగన్‌కు కేంద్రం లేఖ

By:  Tupaki Desk   |   26 Aug 2021 3:30 PM GMT
అభివృద్ధి చేస్తాం.. సహకరించండి, సీఎం జగన్‌కు కేంద్రం లేఖ
X
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ కు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేఖ రాశారు. రాష్ట్రంలో విమానాశ్రయాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం భూమి, ఇతర విషయాల్లో చేయూత అందించాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు విమానాశ్రయాలకు కొంత భూమి ఇచ్చింది. కానీ తిరుపతిలో రన్‌ వే విస్తరణ, ఇతర నిర్వహణ అవసరాల కోసం 14.31 ఎకరాల భూమి అవసరమన్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో నివాస కాలనీ నిర్మాణానికి 10.25 ఎకరాలు కావాలని, కడపలో రన్‌ వే విస్తరణ, అప్రోచ్‌ లైనింగ్‌ సిస్టం కోసం 50 ఎకరాలు అవసరమన్నారు.

ఇవేవీ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అందించలేదని తెలిపారు. విజయవాడ రన్‌వేను 4వేల మీటర్ల వరకు విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కాలువను మళ్లించాలన్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా రూ.14.64 కోట్లను రీజినల్‌ ఎయిర్‌ కనెక్టివిటీ ట్రస్టుకు జమ చేయాలన్నారు. జులై 31 వరకు ఉడాన్‌ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం వీజీఎఫ్‌ వాటాగా 20% చెల్లించాలని.. ఉడాన్‌ పథకంలో విశాఖపట్నం - దుబాయి మధ్య అంతర్జాతీయ విమానాలు నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం వీజీఎఫ్‌ కింద 100% మొత్తాన్ని సమకూరిస్తే ఈ మార్గాన్ని ఎయిర్‌లైన్స్‌ కోసం బిడ్డింగ్‌కు పెడతామన్నారు. ప్రభుత్వం నుంచి సమ్మతి రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.

ఇటీవలే విజయవాడ రన్‌వేను విస్తరించి ప్రారభించారు. అయితే ఆ రన్‌వేను 4వేల మీటర్ల వరకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఇలా చేయాలంటే ఏలూరు కాలువను మళ్లించాల్సి ఉంది. ఈ పనులను చేపట్టాలని సింధియా సీఎం జగన్‌ను కోరారు. ఉడాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14.64 కోట్లను చెల్లిచాల్సి ఉందని.. వెంటనే ఈ మొత్తాన్ని రీజినల్‌ ఎయిర్‌ కనెక్టివిటీ ట్రస్టుకు జమ చేయాలని కోరారు. వీజీఎఫ్‌ వాటాగా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. విశాఖపట్నం - దుబాయి మధ్య అంతర్జాతీయ విమానాలు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

దీని కోసం ఏం చేయాలో కూడా లేఖలో సింధియా వివరించారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద వంద శాతం మొత్తాన్ని సమకూరిస్తే ఎయిర్‌లైన్స్‌ కోసం బిడ్డింగ్‌కు పెడతామని చెప్పారు. వీటన్నింటిపై ఏపీ సర్కార్ స్పందించిన తర్వాత అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తామని సింధియా తన లేఖలో పొందుపరిచారు. ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి పలు కంపెనీలు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. దీనికి కారణం ఉడాన్ పథకం కింద వారికి ఇవ్వాల్సిన ప్రోత్సహకాలు ఇవ్వకపోవడమే కారణం అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రమంత్రి కూడా రూ.14.64 కోట్లను చెల్లిచాల్సి ఉందని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.