Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్‌ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు ... !

By:  Tupaki Desk   |   8 Jun 2021 10:34 AM GMT
వ్యాక్సినేషన్‌ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు ... !
X
మనదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. అయితే, కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడం తో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ పై దృష్టి పెట్టింది. జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. జూన్‌ 21లోపు రెండు వారాల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జనాభా, కరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది.

టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ కేటాయింపుల్లో కోత విధిస్తామని కేంద్రం, అన్ని ఆస్పత్రులకు సమానంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కావాల్సిన డోసుల వివరాలను రాష్ట్రాలే ఇవ్వాలని తెలిపింది. పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవడం కోసం ఈ వోచర్లు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఇక కరోనా వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాల కు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. దేశంలో 63 రోజుల త‌ర్వాత తొలిసారి ల‌క్ష క‌న్నా త‌క్కువ‌గా రోజువారీ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో మొన్న‌ 1,00,636 క‌రోనా కేసులు నమోదు కాగా, నిన్న 86,498 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం, నిన్న 1,82,282 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,96,473 కు చేరింది. మరో 2,123 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,51,309కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,73,41,462 మంది కోలుకున్నారు. 13,03,702 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,61,98,726 మందికి వ్యాక్సిన్లు వేశారు.