Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోం పై కేంద్రం ప్రత్యేక చట్టం.!

By:  Tupaki Desk   |   24 Dec 2021 11:30 PM GMT
వర్క్ ఫ్రం హోం పై కేంద్రం ప్రత్యేక చట్టం.!
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచంలోని చాలా కంపెనీలు వర్క్ చేయడానికి సిద్ధ పడ్డాయి. వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండడంతో వివిధ దేశాల్లో ప్రభుత్వాలు విధించిన ఆంక్షల మేరకు ఆఫీస్ నుంచి పనిచేయడం కుదరలేదు. దీంతో ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం అనే నిర్ణయం తీసుకున్నాయి.

అయితే ఈ నిర్ణయం తో ప్రైవేటు సంస్థలపై కొంత మేర భారం తగ్గింది. అంతేకాకుండా రోజువారి ఖర్చులు తగ్గి లాభాలు కూడా బాగానే ఆర్జించాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉండే వివిధ కంపెనీలు ఈ విధానానికి ఓటు వేశాయి. దీంతో పాటు హైబ్రిడ్ విధానాన్ని కూడా అమలు చేశాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ విధానంలోనే పనిచేస్తున్నాయి.

ఉద్యోగులకు కూడా ఈ విధానం సౌకర్యవంతంగా ఉండడంతో అలవోక చేస్తున్నారు.గూగుల్ లాంటి కొన్ని పెద్ద సంస్థలు అయితే ఉద్యోగుల వెల్ బీయింగ్ కోసం అని బోనస్​ లు కూడా ప్రకటించాయి. అయితే అనంతర కాలంలో జరిగిన కొన్ని కీలక పరిణామాల వల్ల చాలా కంపెనీలు తిరిగి వర్క్ ఫ్రొం హోమ్ కి పుల్ స్టాప్ పెట్టి ఆఫీసు నుంచి పనిచేయాలని భావించాయి.

ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి నుంచి ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని చాలా కంపెనీలు ఉద్యోగులకు మౌఖికంగా తెలియజేశాయి. ఇంతలోనే దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ వ్యాప్తితో తిరిగి సందిగ్ధంలో పడ్డాయి. ఈ కారణంగా తిరిగి హైబ్రిడ్ విధానానికి మొగ్గు చూపాయి.

ఇలాంటి నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం లో పనిచేసే ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎకనామిక్ టైమ్స్ అనే ఓ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రైవేట్ సంస్థలకు వర్క్ ఫ్రం హోం ను ప్రోత్సహించే విధంగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ విధానంలో పని చేయడం వల్ల కరోనా వ్యాధిని నివారించవచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ విధానం అమలుకు వివిధ సంస్థలతో పూర్తి స్థాయిలో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. కొత్త వేరియంట్ దృష్టిలో పెట్టుకొని కంపెనీలు సహకరించాలని కోరినట్లు పేర్కొంది.

అంతేకాకుండా వర్క్​ ఫ్రం హోం పై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకుగానూ ఓ ప్రముఖ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ తో కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం వర్క్​ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు కనీసం అవసరాల మేరకు అదనంగా వైఫై బిల్లు, కరెంటు బిల్లుల తో పాటు పని చేయడానికి అవసరమయ్యే వాతావరణాన్ని కల్పించే విధంగా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు మీడియా కథనం స్పష్టం చేసింది.

ఓ సర్వే ప్రకారం వివిధ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా కరోనా వైరస్​ ఉన్నంత వరకు వర్క్​ ఫ్రం హోం విధానాన్ని కంపెనీలు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ సర్వే భారత్​ లాంటి సుమారు 25 దేశాల్లో జరిగినట్లు సర్వే సంస్థ అయిన ఓఈసీడీ చెప్పింది.