Begin typing your search above and press return to search.

కొత్త వ్యవసాయ చట్టానికి 5 సవరణలు ప్రతిపాదించిన కేంద్రం

By:  Tupaki Desk   |   9 Dec 2020 12:56 PM GMT
కొత్త వ్యవసాయ చట్టానికి 5 సవరణలు ప్రతిపాదించిన కేంద్రం
X
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిసెంబరు 8న దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన బంద్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. రైతులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా దాదాపుగా అన్ని పార్టీలు సంఘీభావం తెలిపాయి. సామాన్యులు, వ్యాపారులు సైతం రైతన్నలకు వెన్నుదన్నుగా మేమున్నామంటూ స్వచ్ఛదంగా బంద్ పాటించారు. దీంతో, దిగివచ్చిన కేంద్రం ప్రభుత్వం...యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రైతు సంఘాలతో చర్చలు జరిపాలంటూ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను పురమాయించింది. ఈ నేపథ్యంలోనే కొత్త వ్యవసాయ చట్టాలకు కొన్ని సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. ఆ సవరణలపై రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. తాము చేసిన 5 సవరణలపై లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకూ కేంద్రం అంగీకరించింది.

రైతుల ప్రధాన డిమాండ్ అయిన“కనీస మద్దతు ధర” ( MSP) విధానాన్ని యథాతధంగా కొనసాగిస్తూ కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలకు సవరణను ప్రతిపాదించింది. “మండి వ్యవస్థ” ( ఏ.పి.ఎమ్.సి) ను రైతుల అభిప్రాయానికి తగ్గట్టు మార్పులు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వ - ప్రైవేటు మార్కెట్లలో ఒకే పన్ను విధానం ఉండేలా కొత్త చట్టాన్ని కేంద్రం సవరించింది. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసే విధంగా రైతులకు సవరణలను ప్రతిపాదించింది.వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రైవేట్ కంపెనీ పేరు నమోదు తప్పనిసరి చేసింది. కొత్త చట్టం ప్రకారం “పాన్” కార్డు ఉన్న వారంతా పంట కొనుగోలు చేయొచ్చు. అయితే, రిజిస్టర్ చేసుకున్న వారే పంట కొనుగోలు చేయాలన్న సవరణను కేంద్రం చేసింది. ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పులకు కేంద్రం అంగీకరించింది. వ్యాపారులు-రైతుల “కాంట్రాక్ట్ వ్యవసాయం” ఒప్పందాలలో వివాదాల పరిష్కారానికి రైతులు సివిల్ కోర్టును ఆశ్రయించేలా సవరణ చేసింది. కొత్త చట్టంలో ఆ అధికారం జాయింట్ కలెక్టర్ కు ఉండడంపై రైతులు అభ్యంతరం తెలపడంతో ఈ సవరణ చేసింది. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించే విధంగా సవరణ చేసింది. పంట వ్యర్థాల దహనం వ్యవహారంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మరి, ఈ సవరణలకు రైతు సంఘాల నేతలు అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, చాలామంది రైతులు యథావిధిగా పాత విధానాన్ని అమలు చేయాలని...కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.