Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ పై కేంద్రం మరో సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   22 Nov 2021 2:30 AM GMT
వ్యాక్సినేషన్ పై కేంద్రం మరో సంచలన నిర్ణయం
X
కరోనా ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను చేపట్టి సఫలీకృతమైంది. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ చురుగ్గా సాగుతున్న వేళ... ఇప్పటివరకు వాక్సినేషన్ అయిన వారిని గుర్తించేలా కొవిన్ పోర్టల్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ కేవలం వ్యక్తిగతంగా మాత్రమే చూసుకునేలా ఉన్న సౌకర్యాన్ని... ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ స్టేటస్ ను సర్వీస్ ప్రొవైడర్లు కూడా తెలుసుకునే వెసలుబాటు కల్పించింది. అలా అయితే ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారా..? దానికి ఓ లింక్ ను రూపొందించింది. వ్యక్తి అనుమతితోనే తెలుసుకునే వీలు కల్పించింది.

కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికుల వ్యాక్సినేషన్ స్టేటస్ ను సంబంధిత సంస్థలు సులభంగా గుర్తించవచ్చు. అయితే దీనికి ఒక చిన్న ఓటీపీ కావాల్సి ఉంటుంది. సంబంధిత వ్యక్తి నమోదు చేసుకున్నా ఫోన్ నంబర్ కు మొదటగా ఓటీపీ వస్తుంది. దీనిని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు చెప్పినట్లయితే ఆ వ్యక్తి వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో తీసుకున్నాడా? లేదా? అనేది తెలుస్తుంది. ఫలితంగా టీకా తీసుకోని వారిని గుర్తించవచ్చు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రస్తుతం ఉన్న ఆంక్షల అమలుకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇదంతా కరోనాను నియంత్రించే ప్రయత్నంలో భాగమేనని చెబుతున్నారు.

ఈ వెసలుబాటును కేవలం ప్రయాణ సంస్థలకు మాత్రమే కాకుండా కార్యాలయాలు కూడా తెలుసుకునేలా పరిశీలిస్తున్నారు. ఈ సదుపాయంతో వ్యాక్సినేషన్ ను పూర్తి అయిన వారిని ప్రయాణాలు కానీ కార్యాలయాలకు కానీ అనుమతించేలా సంబంధిత సంస్థలు చర్యలు చేపట్టవచ్చు. ఈ నిర్ణయం టీకా తీసుకునే వారి సంఖ్యను కూడా పెంచేలా చేస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ మనదేశంలో వంద కోట్లకు పైగా జనం మొదటి డోసు తీసుకున్నట్లు అధికారులు పునరుద్ఘాటించారు. వ్యాక్సినేషన్ రెండు డోసులను అందరూ తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు దేశంలో రెండు దోసులను పూర్తి చేసుకున్న వారు 40 శాతానికి పైగా ఉన్నట్లు వెల్లడించారు.

కరోనా రెండో దశలో వ్యాపించిన వేరియంట్ తో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా తొలుత టీకా తీసుకోవడానికి భయపడిన వారు... ఆ తర్వాత ముందుకు వచ్చారు. ఈ క్రమంలో అందరికీ డోసులను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రతీ ఒక్కరూ టీకా తీసుకునేలా చర్యలు చేపట్టాలని సంకల్పించింది ఇందుకోసం టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లు నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం రూరల్, అర్బన్ ఏరియాల్లో వ్యాక్సినేషన్ యాక్టివ్ గా సాగుతోంది. త్వరలో చిన్న పిల్లలకి కూడా టీకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

మరోవైపు వ్యాక్సినేషన్ ను పూర్తిస్థాయిలో తీసుకున్న వారికి కూడా వైరస్ సోకడం ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే దీనిపై అధికారులు మాత్రం మరో విధంగా చెప్తున్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్నంత మాత్రాన వైరస్ రాకుండా ఉండదని... మరికొన్ని రోజులు మాస్క్ ధరించాలని, చేతులను శానిటైజర్ ను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా మరికొన్నాళ్లు ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.