Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన భార‌త్ విద్యార్థుల‌కు కేంద్రం షాక్!

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:30 AM GMT
ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన భార‌త్ విద్యార్థుల‌కు కేంద్రం షాక్!
X
ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో అక్క‌డ చ‌దువుతున్న వేలాది మంది భార‌తీయ విద్యార్థులు స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్‌లో భార‌తీయ విద్యార్థులు యుద్ధానికి ముందు 22000 మంది వ‌ర‌కు ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌ధానంగా వీరిలో అత్య‌ధికులు ఎంబీబీఎస్ కోర్సు చేయ‌డానికి ఉక్రెయిన్ వెళ్లిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

భార‌త్‌లో ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌కు అయ్యే వ్య‌యం కంటే ఉక్రెయిన్‌లో త‌క్కువే అవుతుండటం, నాణ్య‌మైన విద్య ల‌భిస్తుండ‌టం, ఉక్రెయిన్ ఎంబీబీఎస్‌కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు ఉండ‌టం వంటి కార‌ణాల‌తో చాలామంది భార‌తీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో గ‌త కొన్నేళ్లుగా విద్య‌న‌భ్య‌సిస్తున్నారు. అయితే అనుకోని ఉప‌ద్ర‌వంలా ఉక్రెయిన్ - ర‌ష్యా యుద్ధం వారిని దెబ్బ‌కొట్టింది. దీంతో అక్క‌డ చిక్కుకుపోయిన విద్యార్థుల‌ను భార‌త్ ప్ర‌భుత్వం విమానాల్లో సుర‌క్షితంగా ఇండియాకు తీసుకొచ్చింది.

మ‌రోవైపు ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన విద్యార్థులు తాము న‌ష్ట‌పోకుండా భార‌త్ ప్ర‌భుత్వం ఇక్క‌డి క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాలు క‌ల్పించే విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని గ‌తంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో తాజాగా కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు భారత మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సర్దుబాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం త‌న అఫిడవిట్‌లో పేర్కొంది. చట్ట ప్రకారం.. అందుకు ఎలాంటి నిబంధనలు లేనందున బదిలీ/సర్దుబాటు కుదరదని తేల్చిచెప్పింది. త‌మ‌ను భారత వైద్య కళాశాలలకు బదిలీ చేయాలంటూ ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లకు స్పందనగా కేంద్ర ప్రభుత్వం ఈ విష‌యాన్ని తెల‌ప‌డంతో ఉక్రెయిన్ విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోక త‌ప్ప‌దు.

'ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులను ఇక్కడి మెడికల్‌ కాలేజీలు/యూనివర్సిటీల్లో సర్దుబాటు చేయడం లేదా ఇక్కడికి బదిలీ చేసేందుకు నేషనల్‌ మెడికల్ కమిషన్‌ అనుమతి ఇవ్వలేదు. విదేశీ వైద్య విద్యార్థులను భారత మెడికల్‌ కాలేజీలకు బదిలీ చేయడం లేదా సర్దుబాటు చేసే అంశానికి సంబంధించి ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌-1956 లేదా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ యాక్ట్‌- 2019లో ఏ విధమైన నిబంధనలు లేవు' అని కేంద్ర ప్రభుత్వం త‌న అఫిడ‌విట్‌లో స్ప‌ష్టం చేసింది.

ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు మ‌న దేశంలో నిర్వహించే నీట్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణ‌త‌ సాధించలేక‌పోయార‌ని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా ఆర్థికంగా స్థితిమంతులు కావ‌డంతోనే వారంతా ఉక్రెయిన్‌కు వెళ్లార‌ని వెల్ల‌డించింది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి వ‌చ్చేసిన‌ విద్యార్థులకు భార‌త్‌ వైద్య కళాశాలల్లో ప్రవేశం కలిపిస్తే ఇతర ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్న‌వించింది.

అయితే.. ఉక్రెయిన్ విద్యార్థులు ఇతర దేశాల్లో ఎంబీబీఎస్‌ను పూర్తిచేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విష‌యంలో భారత విదేశాంగ శాఖతో నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ (ఎన్ఎంసీ) సంప్రదింపులు జరుపుతోందని కేంద్రం వెల్ల‌డించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌ 6న పబ్లిక్‌ నోటీస్ కూడా జారీ చేసినట్లు వివ‌రించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.