Begin typing your search above and press return to search.

తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్లపై కేంద్రం షాకింగ్ వ్యాఖ్య

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:30 PM GMT
తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్లపై కేంద్రం షాకింగ్ వ్యాఖ్య
X
రాష్ట్ర విభజన జరిగిన ఏడున్నరేళ్లు అవుతున్నప్పటికీ.. ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పలు అంశాల లెక్క ఇప్పటికి ఒక కొలిక్కి రాని విషయం తెలిసిందే. అన్నింటికి మించి తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వానికి రూ.6వేల 111 కోట్ల మొత్తం విద్యుత్ బకాయిల పద్దు కింద రావాల్సి ఉంది. అయితే.. దీనికి సంబంధించిన నిధుల్ని తెలంగాణ విడుదల చేసే విషయంలో కొర్రీల మీద కొర్రీలు పెడుతోంది.

ఈ క్రమంలో ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నుంచి తమకు రావాల్సిన రూ.6వేల కోట్ల బకాయిల్ని ఇప్పించే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. ఈ అంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న సమాధానాన్ని ఇచ్చారు.

ఈ అంశం పూర్తిగా రెండు రాష్ట్రాల మధ్య సమస్య అయినందున.. చర్చలతో పరిష్కరించుకోవాలన్న ఉచిత సలహా ఇచ్చారు. ఈ అంశం కోర్టులో పెండింగ్ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన రూ.6వేల కోట్ల విద్యుత్ బకాయిలు వస్తే.. కొంతలో కొంత ఉపశమనంగా ఉంటుందని భావిస్తోంది.

కానీ.. తెలంగాణ సర్కారు మాత్రం అందుకు సానుకూలంగా స్పందించటం లేదు. ఏదో ఒక కొర్రీ పెడుతుందే తప్పించి.. బకాయిల్ని ఇచ్చేందుకు సుముఖంగా లేని పరిస్థితి. కేంద్రాన్ని జోక్యం చేసుకోమనటం ద్వారా.. సమస్యకు పరిష్కారంలభిస్తుందని ఆశిస్తే.. అందుకు భిన్నమైన స్పందన కేంద్ర మంత్రి నోటి నుంచి రావటం ఏపీకి ఇబ్బందికరమైన అంశంగా చెప్పక తప్పదు.