Begin typing your search above and press return to search.

కేంద్రం షాకింగ్ నిర్ణయం: ఆ ఓటీటీలపై నిషేధం

By:  Tupaki Desk   |   13 Dec 2022 10:48 AM GMT
కేంద్రం షాకింగ్ నిర్ణయం: ఆ ఓటీటీలపై నిషేధం
X
ఓటీటీలు వచ్చాక సగం మంది థియేటర్ కు వెళ్లి సినిమా చూడడంలేదు. ఎలాగూ రెండు నెలల తర్వాత ఓటీటీకి వస్తుందని ఇంట్లోనే ఎదురుచూస్తున్నారు. ఇక ఓటీటీల్లో కంటెంట్ కు కూడా సెన్సార్ లేకుండా పోయింది. అశ్లీలం, క్రైమ్, హింస మరీ ఎక్కువైపోయింది. ఇక కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టేలా కూడా వెబ్ సిరీస్ లను, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొరఢా ఝలిపించింది. భారత్ దేశభద్రతకు ముప్పు తెచ్చేలా ప్రోగ్రాంలు వండి వారుస్తున్న ఓటీటీలను నిషేధించి గట్టి షాక్ ఇచ్చింది.

పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విడ్లీ టీవీకి చెందిన రెండు మొబైల్ అప్లికేషన్‌లు, వెబ్‌సైట్, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు, స్మార్ట్ టీవీ యాప్‌లను బ్లాక్ చేస్తూ భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అందులో భారత్ వ్యతిరేక కంటెంట్ ప్రసారం చేస్తున్నారన్న ఫిర్యాదులకు మేరకు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. విడ్లీటీవీలో ప్రసారమయ్యే ఒక సిరీస్ ప్రసారమై దుమారం రేపింది. ఇది దేశ జాతీయ భద్రత , సమగ్రతకు హానికరం అని తేల్చింది.

26/11 ముంబై ఉగ్రదాడుల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ ఓటీటీ విడ్లీ టీవీ 'సేవక్: ది కన్ఫెషన్స్' పేరుతో వెబ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఇది భారతదేశ భద్రత, సార్వభౌమాధికారం , భారతదేశ సమగ్రతకు ప్రమాదకరమని కేంద్రం సీరియస్ అయ్యింది. సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఈ మేరకు ఈ విడ్లీ టీవీని భారత్ లో బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. "రెచ్చగొట్టేలా పూర్తిగా అవాస్తవమైన వెబ్ సిరీస్ 'సేవక్‌'ను పాకిస్తాన్ ఇన్‌ఫో ఆప్స్ స్పాన్సర్ చేసిందనే అంచనాకు వచ్చాం. అందుకే విడ్లీ టీవీపై చర్య తీసుకున్నాం." అని పేర్కొన్నారు.

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, ఆపరేషన్ బ్లూ స్టార్, దాని అనంతర పరిణామాలు, మాలెగావ్ బ్లాస్ట్‌లు, గ్రాహం స్టెయిన్స్ అనే క్రైస్తవ మిషనరీ హత్య, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ వంటి సున్నితమైన చారిత్రక సంఘటనలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై ఈ ధారావాహిక భారతదేశ వ్యతిరేక కథనాలను చిత్రీకరించి ప్రసారం చేసినట్టు సమాచారం.

సట్లెజ్ యమునా లింక్ కాలువకు సంబంధించిన పేలుళ్లు, అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదం గురించి సీరియల్స్ ప్రసారం చేయడంతో కేంద్రం సీరియస్ అయ్యి ఈ మేరకు నిషేధించి షాక్ ఇచ్చింది. మిగతా ఓటీటీలకు కూడా ఈ నిర్ణయం హెచ్చరికలాంటిదని కేంద్రం తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.