Begin typing your search above and press return to search.

ఖలిస్తాన్ ఎఫెక్ట్: అక్కడి భారతీయులను హెచ్చరించిన కేంద్రం

By:  Tupaki Desk   |   24 Sep 2022 12:30 AM GMT
ఖలిస్తాన్ ఎఫెక్ట్: అక్కడి భారతీయులను హెచ్చరించిన కేంద్రం
X
భారత్ కు వ్యతిరేకంగా కెనడాలో సాగుతున్న ‘ఖలిస్తాన్’ ఉద్యమంపై కేంద్రప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని భారత్ స్వయంగా కెనడాను కోరింది. అయినా ప్రజాస్వామ్యయుతమైన ఈ ఆందోళనను తాము అణిచివేయమని కెనడా షాకిచ్చింది. ఈక్రమంలోనే కెనడాలో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేయడం సంచలనమైంది.

కెనడాలో విద్వేషపూరిత ఘటనలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని పేర్కొంటూ అప్రమత్తంగా వ్యవహారించాలని భారత ప్రభుత్వం సూచించింది. భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే ఇప్పుడు సంచలనమైంది.

కెనడాలో విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఘటనలు భారీగా పెరిగాయి. మరోవైపు ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కెనడా ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. విదేశాంగ శాఖతోపాటు కెనడాలోని భారత హైకమిషన్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. పూర్తిస్తాయిలో దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరినా స్పందన లేకుండా పోతోంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే భారత ప్రభుత్వం స్వయంగా హెచ్చరికలు పంపింది. కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులతోపాటు , ట్రావెల్, ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియాతోపాటు టొరంటో, వాంకోవర్ లలోని కాన్సులేట్ వెబ్ సైట్ ల పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సంప్రదించేందుకు భారత అధికారులకు అవకాశం లభిస్తుంది.

సిక్కు వేర్పాటు వాదుల ‘ఖలిస్థాన్’ లొల్లి ఇప్పటిది కాదు.. దశాబ్ధాలుగా వారు తమకు సొంత దేశం కావాలంటూ పోరాడుతున్నారు. తమకంటూ ఓ ప్రత్యేక దేశం కావాలంటూ భారత ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కెనడాలో చాలా ఎక్కువమంది సిక్కులు ఉన్నారు. ఈక్రమంలోనే సిక్కు వేర్పాటువాదులు తాజాగా కెనడా దేశంలో ‘ఖలిస్తాన్’పై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించడం దుమారం రేపింది. ఇది భారత్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. లక్షలమంది కెనడియన్ సిక్కులు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కలిస్తాన్ అనుకూల గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జీ) కెనడాలోని బ్రాంప్టన్ లో దీనిని నిర్వహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎస్ఎఫ్.జీని 2019లో భారత ప్రభుత్వం నిషేధించింది.

పంజాబ్ లో సిక్కులతో కూడిన ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఎస్ఎఫ్.జే ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పంజాబ్ ప్రజల్లో కనుక ఒకసారి ఏకాభిప్రాయం కుదిరితే అప్పుడు తాము పంజాబ్ ను ప్రత్యేక దేశంగా పున: స్థాపించాలనే డిమాండ్ తో ‘ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సమాజాన్ని కలుస్తామని’ రెఫరెండం 2020 నిర్వహించిన సభ్యులు స్పష్టం చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.