Begin typing your search above and press return to search.

మారటోరియం పొడగింపు ఇకపై కుదరదు .. స్పష్టం చేసిన కేంద్రం, ఆర్‌బీఐ

By:  Tupaki Desk   |   10 Oct 2020 10:50 AM GMT
మారటోరియం పొడగింపు ఇకపై కుదరదు .. స్పష్టం చేసిన కేంద్రం, ఆర్‌బీఐ
X
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే లక్ష్యంతో అమల్లోకి తీసుకొచ్చిన మారటోరియం పొడిగింపు పై ఓ స్పష్టత వచ్చేసింది. పొడిగింపు ఇక పై సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు స్పష్టం చేసాయి. రుణ మారటోరియం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ లో కేంద్రం, ఆర్ ‌బీఐ దీనిపై తేల్చేసింది. ఆరు నెలలకు మించి ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అఫిడవిట్ ‌లో క్లారిటీ ఇచ్చేసింది.

కరోనా వైరస్ సంక్రమణ, లాక్ డౌన్ నేపధ్యంలో ఎక్కడికక్కడ జనజీవనం స్థంబించింది. ఉపాది కనుమరుగైపోయింది. ఈ నేపధ్యంలో రుణ గ్రహీతలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మారటోరియం విధించింది. అయితే ఈ మారటోరియంను మరోసారి పొడిగించాలనే విషయంపై చర్చ సాగింది. మారటోరియం కాలంలో 2 కోట్ల వరకూ ఉన్న రుణాలపై వడ్డీపై వడ్డీని వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో క్రెడాయ్ వంటి సంఘాల వాదన పరిశీలించాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం , ఆర్బీఐ మారటోరియంపై స్పష్టత ఇచ్చాయి. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాయి.

నిర్దిష్ట సెక్టార్ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి కోర్టు వెళ్లకూడదంటూ తాజా అఫిడవిట్‌లో ఆర్‌బీఐ, ప్రభుత్వం పేర్కొన్నాయి. మారటోరియం వ్యవధి ఆరునెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరు, ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ చర్య రుణ గ్రహీతలపై ఒత్తిడిని పెంచుతుందని కూడా వాదించింది. వడ్డీ మీద మాఫీ చేయడమే కాకుండా, మరే ఇతర ఊరట కల్పించినా దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెల్లడించింది. రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వివరణ ఇచ్చాయి. కాగా ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి అక్టోబర్ 5న ఒక వారం సమయం ఇచ్చింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలంటూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.