Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం ఏమిచేయగలదు ?

By:  Tupaki Desk   |   7 Aug 2021 8:30 AM GMT
జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం ఏమిచేయగలదు ?
X
ఇపుడీ అంశంపైనే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా నానా గోల చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అక్కడ అప్పులు చేస్తున్నారు, ఇక్కడ అప్పులు తెచ్చుకున్నారని పదే పదే రాస్తోంది. తాజాగా గేరుమార్చి మరింత ఎక్కువగా అదే విషయాన్ని తిప్పి తిప్పి రాస్తోంది. ఆవు వ్యాసం రాసినట్లు రాసిన అంశాలనే పదే పదే రాస్తోంది. పరిమితికి మించి జగన్ ప్రభుత్వం అప్పులు చేసేస్తోందని, ఆర్ధిక క్రమశిక్షణ తప్పిందని, అప్పుల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని నానా గోల చేస్తోంది.

ఈ గోల ఏ స్థాయికి చేరుకుందంటే చివరకు రాష్ట్ర అప్పులపై కేంద్రం కన్నెర్ర చేసిందని, అప్పుల లెక్కలు తేల్చడానికి ఏకంగా అకౌంటెంట్ జనరల్ (ఏజీ)ని రంగంలోకి దింపేసిందని , ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టేయబోతోందంటూ ఒకటే ఊదరగొడుతోంది. అంతా నిజమే అనుకుందాం. అయితే కేంద్రం ఏం చేయగలుగుతుంది ? ఆర్థిక క్రమశిక్షణ తప్పిన జగన్ ప్రభుత్వాన్ని ఏమైనా రద్దు చేస్తుందా ? నిజంగా కేంద్రానికి అంత సీన్ ఉందా ?

పార్టీ నేతల సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏమీ చేయలేదు. అప్పులు చేస్తున్నది నిజమే, ఆర్థిక క్రమశిక్షణ తప్పిందీ నిజమే అయినా జగన్ సర్కార్ కు వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే సుమారు రు. 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వానికి జగన్ పగ్గాలు తీసుకున్నాక తాను కూడా అప్పులు చేయకఏమి చేస్తారు ? 2014లో రాష్ట్రం ఏర్పడిందే రు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో. దాంతో పాటు లక్షన్నర కోట్ల అప్పు అప్పటికే రాష్ట్రానికి ఉంది. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి దిగిపోయేనాటికి రు. 2.7 లక్షల కోట్లకు చేరుకుంది.

అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని నడపటానికి జగన్ కాదు ఇంకెవరు సీఎం అయినా అప్పులు చేయాల్సిందే. పైగా గడచిన ఏడాదిన్నరగా కరోనా వైరస్ సమస్య. అప్పుల విషయంలో ఏపీ అని కాదు దేశం మొత్తం మీద అప్పుల్లో లేని రాష్ట్రం దేనైనా చూపించమని మంత్రి పేర్నినాని సవాలు చేశారు. కేంద్రం కూడా పరిమితికి మంచి లక్షల కోట్లు అప్పులు చేస్తున్న విషయాన్ని పేర్ని గుర్తుచేశారు. చంద్రబాబు ఆర్థిక క్రమశిక్షణను పాటించకుంటే ఇపుడు జగన్ ప్రభుత్వాన్ని నిందించినా అర్థముంది.

చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత అప్పటివరకు ఆర్ధిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఖజానాలో ఉన్నది కేవలం రు. 100 కోట్లు మాత్రమే అని చెప్పారు. అలాగే అందినకాడికి తామే అప్పులు చేసేశామని జగన్ ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టవని ఎగతాళి చేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి అప్పులు చేస్తున్నదన్న కారణంతో జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం చేయగలిగేదేమీ లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.