Begin typing your search above and press return to search.

టమాటా తెచ్చిన ఎమర్జెన్సీ

By:  Tupaki Desk   |   15 Jun 2016 9:51 AM GMT
టమాటా తెచ్చిన ఎమర్జెన్సీ
X
టమాటా దెబ్బకు కేంద్ర ప్రభుత్వం గిలగిలలాడుతుంది. దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేకుండా అన్ని చోట్లా ప్రజలు విస్తృతంగా వాడే టమాటా ధర కేజీ రూ.100 పలుకుతుండడంతో అది ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ప్రమాదం ఉందని గుర్తించి వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నేపత్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. టమాటాతో ఇతర నిత్యావసరాల ధరలు కూడా కొండెక్కడంతో కేంద్రం కంగారు పడుతోంది. టమాటా ధరను వెంటనే నేలకు దించడానికి చేపట్టవలసిన చర్యలపై బుధవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఇతర ముఖ్య శాఖల మంత్రులు వెంకయ్య నాయుడు - నితిన్ గడ్కరీ - రాంవిలాస్ పాశ్వాన్ - రాధా మోహన్ సింగ్ - నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ సహా ఉన్నతాధికారులు భేటీ అయి ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబోతున్నారు.

కాగా గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు - కంది పప్పు ధరలు పెరిగినప్పుడు కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు స్పందించిన సందర్భాలున్నాయి. ఇంతకుముందు ఉల్లి ధరల కారణంగానే ఎన్డీయే ప్రభుత్వం దెబ్బతింది. ఇప్పుడు కందిపప్పు ధర రూ.200 దిశగా పరుగులు తీస్తున్న తరుణంలో కేంద్రం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. తాజాగా దేశమంతా వినియోగించే టమాటా ధరలు కూడా పెరగడంతో కేంద్రం జాగ్రత్త చర్యలు చేపడుతోంది.

తాజాగా భేటీ అయిన మంత్రుల బృందం ధరల స్థిరీకరణకు చేపట్టవలసిన చర్యలపై పారిశ్రామిక సమాఖ్య ఫిక్కీ ఇదివరకే సూచించిన అంశాలను పరిశీలించనుంది. నిత్యావసరాల రవాణాను సులభతరం చేయడంద్వారా టమాటా ధరలను అదుపు చేయొచ్చని.. రాష్ట్రాల వద్ద ఉన్న నిల్వల వివరాలను సేకరించి, సమీక్షించడం ద్వారా నిత్యావసరాల ధరలకు కళ్లెం వెయ్యవచ్చని ఫిక్కీ సూచించింది. ధరల స్థిరీకరణకు తాత్కాలిక, శాశ్వత విధానాలను మంత్రులు ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో చక్కెర, మంచినూనె ఇతర వస్తువుల నిల్వలపైనా మంత్రులు చర్చిస్తారని తెలిసింది. దేశవ్యాప్తంగా కిలో టమాటో ధర సరాసరి రూ.80 పలుకుతుండగా, హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రూ.100గా ఉంది. పప్పుదినుసుల ధరలు సరాసరి రూ. 170 (కిలో)కి అమ్ముతుండగా కొన్ని ప్రాంతాల్లోని వ్యాపారులు రూ. 200 వసూలు చేస్తున్నారు. ధరలు ఈ రేంజిలో పెరగడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకముందే అదుపు చేసేందుకు ఎన్డీయే గవర్నమెంటు ప్లాన్ చేస్తోంది.