Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు ఎదురుదెబ్బ‌.. షాకిచ్చిన కేంద్రం!

By:  Tupaki Desk   |   1 Feb 2020 7:38 AM GMT
జ‌గ‌న్‌ కు ఎదురుదెబ్బ‌.. షాకిచ్చిన కేంద్రం!
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కేంద్ర ప్ర‌భుత్వం షాకిచ్చింది. శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ పంపిన బిల్లును కేంద్రం ప‌ట్టించుకో లేదు. ప్ర‌స్తుత బడ్జెట్ స‌మావేశాల షెడ్యూల్‌ లో శాస‌న‌మండ‌లి ర‌ద్దుకు సంబంధించిన బిల్లును పేర్కొన‌లేదు. దీంతో ఆ బిల్లు ఇప్ప‌ట్లో పార్ల‌మెంట్ ముందుకు వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మండ‌లిని ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి పంపింది.

జ‌న‌వ‌ర్ 31న ప్రారంభ‌మైన కేంద్ర బ‌డ్జెట్ స‌మావేశాలు ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా కొన‌సాగ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో మొత్తం 45 బిల్లులు ప్ర‌వేశ‌ పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వీటిలో పాత‌వి 17, కొత్త‌వి 28 బిల్లుల‌ను ఆమోదించుకునే కేంద్రం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల శాఖ షెడ్యూల్ విడుద‌ల చేసింది. అయితే ఆ జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లి ర‌ద్దుకు సంబంధించిన బిల్లు లేదు. దీంతో శాస‌న‌మండ‌లి ర‌ద్దు అంశం ఇప్ప‌ట్లో లేన‌ట్టే తెలుస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వికేంద్రీక‌ర‌ణ చేయాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మూడు రాజ‌ధానుల అంశం తెర‌పైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఇటీవ‌ల అసెంబ్లీలో వికేంద్రీక‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలప‌గా శాస‌న‌మండ‌లిలో ప‌రాభ‌వం ఎదురైంది. త‌ర‌చూ మండ‌లిలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉండ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం శాస‌న‌మండ‌లి ర‌ద్దుకు తీసుకుని అసెంబ్లీ తీర్మానం చేసిన విష‌యం తెలిసిందే. మ‌రి పార్ల‌మెంట్ ఆమోదించ‌ని ప‌క్షంలో ఏపీ సీఎం జ‌గ‌న్ త‌దుప‌రి ఏం చేయ‌బోతున్నారో వేచి చూడాలి.