Begin typing your search above and press return to search.

అగ్నిపథ్ లో ఎంట్రీకి కేంద్రం ఫిటింగ్!

By:  Tupaki Desk   |   20 Jun 2022 4:02 AM GMT
అగ్నిపథ్ లో ఎంట్రీకి కేంద్రం ఫిటింగ్!
X
అగ్నిపథ్ పథకంలో రక్షణదళాల్లో ఎంపిక అవ్వాలని అనుకుంటున్న యువతకు కేంద్రప్రభుత్వం పెద్ద ఫిట్టింగ్ పెట్టింది. నిజానికి ఈ ఫిట్టింగ్ వల్ల మామూలు యువతకు ఎలాంటి సమస్యా లేకపోయినా సమస్యల్లా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అల్లర్లలో పాల్గొంటున్న యువతను టార్గెట్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. ఇంతకీ ఆ ఫిట్టింగ్ ఏమిటంటే దరఖాస్తు సమయంలోనే యువత తాము ఎప్పుడూ ఎలాంటి ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనలేదని వ్యక్తిగతంగా అఫిడవిట్ ఇవ్వాలట.

ఈ నిబంధన వల్ల వేలాదిమంది అభ్యర్ధులు కచ్చితంగా ఇబ్బందులు పడటం ఖాయం. ఎందుకంటే అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దాదాపు 13 రాష్ట్రాల్లోని యువత ఆందోళనలు చేస్తున్నారు.

తమ ఆందోళనల్లో భాగంగా బీహార్, తెలంగాణా, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో రైల్వేస్టేషన్లు, బస్సులను తగలబెట్టడం, దాడులు చేసి రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఇలాంటి ఆందోళనల్లో పాల్గొన్నవారందరినీ పోలీసులు అన్నీ రాష్ట్రాల్లోను గుర్తిస్తున్నారు.

జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారిని సీసీ కెమెరాలు, వీడియోలు, ఫొటోల ఆధారంగా చాలామందిని గుర్తిస్తున్నారు. అంటే ఇలాంటి వారందరికీ దరఖాస్తు చేయటానికి కూడా అర్హత లేకపోయింది. ఎందుకంటే దరఖాస్తుతో పాటు అఫిడవిట్ దాఖలు చేసినవారి విషయం తర్వాత జరిగే పోలీసు వెరిఫికేషన్లో తేలిపోతుంది. పైగా దరఖాస్తు దాకా వెళ్ళకముందే పోలీసులు ఆందోళనల్లో పాల్గొన్నవారిని గుర్తిస్తున్నారు. ఇలాంటివారిపై రైల్వేపోలీసులు కఠినమైన సెక్షన్ల క్రింద ఎలాగూ కేసులు పెడుతున్నారు.

కాబట్టి ఏ రకంగా చూసినా ఆందోళనల్లో పాల్గొన్నవారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదన్నట్లే. క్షణికావేశంలో దాడులకు పాల్పడాలని తీసుకున్న నిర్ణయం చివరకు జీవితం మీదే పెద్ద దెబ్బకొట్టబోతోంది.

తొందరలోనే అగ్నిపథ్ పథకంలో ఎంపికలు పూర్తిచేసి నవంబర్, డిసెంబర్ నుండి నేవీ, అర్మీ, వాయుసేనలో శిక్షణ ఇవ్వబోతున్నట్లు సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనీల్ పూరి, వైస్ అడ్మిరల్ అనీల్ త్రిపాఠి మీడియాతో చెప్పారు. మొత్తంమీద ఆర్మీలో చేరాలని అనుకుంటున్న యువత విషయంలో కేంద్రం పెద్ద ఫిట్టింగే పెట్టిందని అనుకోవాలి.