Begin typing your search above and press return to search.

ఛార్జర్ల సమస్యపై కేంద్రం నజర్.. త్వరలోనే సరికొత్త విధానం

By:  Tupaki Desk   |   10 Aug 2022 10:30 AM GMT
ఛార్జర్ల సమస్యపై కేంద్రం నజర్.. త్వరలోనే సరికొత్త విధానం
X
గతంలో ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ వస్తువులు తప్పించి వెంట తీసుకెళ్లేవి చాలా తక్కువ ఉండేవి. ఉన్నా.. అవన్ని బ్యాటరీలతో నడిచేవిగా ఉండటం.. వాటిని వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉండేది. సెల్ ఫోన్ ఎంట్రీ ఇచ్చాక చాలానే మార్పులు వచ్చాయి. ఇవాల్టి రోజున ఒక్కొక్కరి చేతిలోనే రెండు సెల్ ఫోన్లు.. వాటితో పాటు ల్యాప్ టాప్.. ట్యాబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఎలక్ట్రికల్ వస్తువులు క్యారీ చేస్తున్న పరిస్థితి.

ఇక.. ఇంట్లోని వారంతా కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఎవరి ఫోన్ ఛార్జర్ వారు తీసుకు వెళ్లాల్సి రావటంతో పాటు.. వేర్వేరుగా ఉండే ఛార్జర్లను అన్నింటిని తప్పనిసరిగా క్యారీ చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి వేళ.. చార్జర్ల సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ఒకరు టైప్ సి పోర్టు ఇస్తే.. మరొకరు యూఎస్ బీ పోర్టు అంటారు.

ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు నడుం బిగించింది.
స్మార్ట్ ఫోన్.. ట్యాబ్.. ఇలా గ్యాడ్జెట్ ఏదైనా సరే.. ఛార్జర్ మాత్రం ఒకటే వాడేలా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన కీలక సమావేశాన్ని ఆగస్టు 17న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తోంది.

ఈ సమావేశానికి మొబైల్ కంపెనీ తయారీదారులు.. ఆయా రంగాలతో సంబంధం ఉన్న అన్ని సంస్థల ప్రతినిధులు హాజరవుతారని చెబుతున్నారు. వినియోగదారులకు అనవసరమైన భారం వేయటంతో పాటు.. ఈ వేస్ట్ ను తగ్గించటంలో ఒకటే ఛార్జర్ విధానం కలిసి వస్తుందని భావిస్తున్నారు.

ఛార్జర్ల సమస్యకు పరిష్కారంగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల కోసం కంపెనీలన్నీ విధిగా టైప్ సి పోర్ట్ కలిగిన చార్జర్లను మాత్రమే వినియోగించాలని పేర్కొంది. ఇందుకు 2024ను గడువుగా పెట్టింది. ఇదే తీరులో కేంద్రం కూడా కొత్త గడువును పెట్టనున్నట్లు చెబుతున్నారు.

కామన్ ఛార్జర్ తీసుకొస్తేజనం మీద భారం తగ్గటంతో పాటు.. ఈ వేస్టు సమస్యకు ఒక పరిష్కారం వెతికినట్లు అవుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త విధానానికి సంబంధించిన విధివిధానాలు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.