Begin typing your search above and press return to search.

కేంద్రం చెప్పినట్లుగా తెలంగాణ అప్పు రూ.1360 కోట్లు కాదు రూ.52 కోట్లే

By:  Tupaki Desk   |   20 Aug 2022 3:50 AM GMT
కేంద్రం చెప్పినట్లుగా తెలంగాణ అప్పు రూ.1360 కోట్లు కాదు రూ.52 కోట్లే
X
తప్పులో కాలేసింది కేంద్ర సర్కారు. రాష్ట్రాలు భారీగా బకాయిలు పడ్డారంటూ నివేదిక విడుదల చేసి.. అందులోని తప్పులతో తూచ్ అనేస్తూ.. కొత్త లెక్కల్ని చెప్పుకొచ్చింది. అయితే.. తొలుత చెప్పిన మాటలకు.. వాస్తవానికి పొంతన లేకపోవటం.. చివర్లో లెక్క తేలిన మొత్తం మీదా చేస్తున్న వ్యాఖ్యలు చూసినప్పుడు తొండిగా మాట్లాడుతున్న భావన కలగటం ఖాయం. విద్యుదుత్పత్తి సంస్థలకు వివిధ రాష్ట్రాలకు చెందిన డిస్కంలు చెల్లించాల్సిన బకాయిల విషయంలో కేంద్రం చెబుతున్న లెక్కల్లో తప్పులు బయటకు వస్తున్నాయి.

తెలంగాణ డిస్కంలు దేశ వ్యాప్తంగా జెన్ కోలకు రూ.1360 కోట్ల మేర బకాయి పడినట్లుగా ప్రకటించిన వైనం తెలిసిందే. అయితే.. శుక్రవారానికి ఆ మొత్తం రూ.52.85 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. తాము ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే రోజు వ్యవధిలో బకాయిల మొత్తం ఎలా తగ్గిందని రాష్ట్ర డిస్కం కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. చెల్లించిన సొమ్ము లెక్కను సరిగా చూడకపోవటంతో ఈ తేడాలు వచ్చినట్లుగా పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 13 రాష్ట్రాల డిస్కంలను కేంద్రం బ్యాన్ విధించటం తెలిసిందే. ఇందులో బీజేపీతో పాటు బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు కొలువు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి.

తాజాగా లెక్కలు చూసిన తర్వాత మొదట పేర్కొన్నట్లు కాకుండా.. తెలంగాణ చెల్లించాల్సిన బాకాయిల మొత్తం రూ.52 కోట్లుగా పేర్కొంటే.. రాష్ట్రం మాత్రం అంత కూడా బాకీ ఉండదని చెబుతున్నారు. బకాయి లెక్కలు సరిగా లేవని డిస్కంలు వాదిస్తున్నాయి. ఈ ఇష్యూ మీద కోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

విద్యుత్ అమ్మటం.. కొనటం అన్నది జెన్ కో.. డిస్కంల మధ్య జరిగే ప్రక్రియ అయినప్పుడు.. ఈ అంశంలోకి కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఎక్సైంజీలో కొనకుండా ఆపే అధికారం కేంద్రానికి ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.

విద్యుత్ సంస్థలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తూ.. ఇది ముమ్మాటికి దేశ ద్రోహ చర్యగా మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేందుకు ప్రధాని మోడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన తప్పు పట్టారు.