Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిపై మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

By:  Tupaki Desk   |   19 Aug 2020 12:10 PM GMT
ఏపీ రాజధానిపై మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
X
ఎడతెగని పంచాయితీగా మారిన ఏపీ రాజధాని విషయంలో అధికార వైసీపీ వదలడం లేదు.. ప్రతిపక్ష టీడీపీ విడవడం లేదు. దీంతో హైకోర్టులు.. సుప్రీంకోర్టుల వరకు వివాదం సాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని విషయంలో కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానాన్ని నిర్ణయించడంలో తమకు ఎలాంటి పాత్ర లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం మరోసారి ప్రకటించింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని కుండబద్దలు కొట్టింది. ఇందుకు సంబంధించిన అఫిడవిట్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లలితా టి హెడౌ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధాని నగరంగా నిర్ణయించింది. అప్పుడు కూడా కేంద్రం అంగీకరించింది. అయితే ప్రస్తుత వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను నిర్ణయిస్తూ జూలై 31న గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసిందని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. విశాఖపట్నం వద్ద పరిపాలన రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా.. మరియు కర్నూలులో న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణయించిందని తెలిపింది..

రాష్ట్ర శాసనసభ మూడు రాజధానుల బిల్లుతో పాటు ఏపీసిఆర్డిఏ రద్దు బిల్లును ఆమోదించినట్లు కేంద్రం అంగీకరించింది. ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించలేదని తెలిపింది. "ఈ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో భాగం లేదు" అని హోంశాఖ అధికారి లలితా హెడౌ కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

"పైన పేర్కొన్న విషయాలు.. స్థానిక అంశాల ఆధారంగా జరిగిన రాజధానుల మార్పు విషయంలో కేంద్రం జోక్యం లేదని.. రాష్ట్ర ప్రభుత్వానికే సర్వ అధికారాలు ఉన్నాయని.. దీనిని న్యాయస్థానం ఆమోదించాలని" అని కేంద్ర ప్రభుత్వ అధికారి అఫిడవిట్‌లో పేర్కొన్నారు.