Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ రెండో రాజ‌ధాని..కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

By:  Tupaki Desk   |   27 Nov 2019 12:58 PM GMT
హైద‌రాబాద్ రెండో రాజ‌ధాని..కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!
X
ఢిల్లీ కాలుష్యం - తెలంగాణ‌లోని రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో...హైద‌రాబాద్ ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లోకి ఎక్కిన సంగ‌తి తెలిసిందే. దేశ రాజధాని కాలుష్యమ‌యం అయిపోవ‌డంతో ప్రత్యామ్నాయంగా భౌగోళిక - వాతావరణ - ప్రకృతి సమతుల్యతలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం రెండవ రాజధానిగా ఆమోదయోగ్యంగా ఉంటుంద‌ని భావిస్తోంద‌ని గ‌త కొద్దికాలంగా ప్ర‌చారం జోరుగా సాగింది.అయితే, దీనికి తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం నేడు స్ప‌ష్టం చేశారు. కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేర‌కు సంబంధిత ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

హైద‌రాబాద్ రెండో రాజ‌ధాని కావ‌చ్చ‌నే చ‌ర్చ‌ను తెర‌మీద‌కు తెచ్చింది బీజేపీ సీనియ‌ర్ నేతే కావ‌డం గ‌మ‌నార్హం. మహారాష్ట్ర గవర్నర్‌ గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం హైద‌రాబాద్‌ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ...దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం భయంకర స్థాయికి చేరుకున్నందున దేశానికి హైదరాబాద్‌ రెండో రాజధాని అవుతుందేమోనని బీజేపీ సీనియ‌ర్ నేత‌ చెన్నమనేని విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాసాగర్ రావు ``దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అక్కడి పరిస్థితులను చూస్తుంటే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమో’ అని అన్నారు. విద్యాసాగర్ రావు కామెంట్ల నేప‌థ్యంలో అంద‌రి చూపు కేంద్రం వైఖ‌రిపై ప‌డింది.

అయితే, కొద్దిరోజుల‌కే సికింద్రాబాద్ ఎంపీ - కేంద్ర హోంశాఖ స‌హాయమంత్రి జి.కిష‌న్‌ రెడ్డి ఈ ప్ర‌చారాన్ని కొట్టిపారేశారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల నేప‌థ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిష‌న్ రెడ్డి హైదరాబాద్‌ నగరాన్ని దేశ రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనేదీ తమ మంత్రిత్వశాఖలో లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ను రెండో రాజధానిగా చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు జ‌రుగుతున్నదంతా... ప్రచారం మాత్ర‌మేన‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. తాజాగా రాజ్యసభలో దక్షిణ భారత్‌ లో దేశానికి రెండో రాజధాని అవసరమని ప్రభుత్వం భావిస్తుందా అన్న ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సంబంధిత ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ...దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన ఏదీ లేదని కొట్టిపారేశారు.