Begin typing your search above and press return to search.

2000 నోటు పై కేంద్రం క్లారిటీ!

By:  Tupaki Desk   |   11 Dec 2019 1:30 AM GMT
2000 నోటు పై కేంద్రం క్లారిటీ!
X
మోడీ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో అనే సందేహాలు మార్కెట్ ను ప్ర‌జ‌ల‌ను బెదిరిపోయేలా చేస్తూ ఉన్నాయి. పొద్దుపోయిన త‌ర్వాత ప్ర‌క‌ట‌న‌ల‌కు, అర్ధ‌రాత్రి త‌ర్వాత నిర్ణ‌యాల‌కు మోడీ కేరాఫ్ అయ్యారు. మూడేళ్ల కింద‌ట ఇచ్చిన నోట్ల ర‌ద్దు మాస్ట‌ర్ స్ట్రోక్ మోడీ విష‌యంలో ప్ర‌జ‌లు మ‌రిచిపోయేలా లేరు.

ఇలాంటి నేప‌థ్యంలో కొన్ని రూమ‌ర్ల‌కు కూడా అవ‌కాశం ఏర్ప‌డుతూ ఉంది. అందులో ఒక‌టి.. రెండు వేల రూపాయ‌ల నోటు విష‌యంలో త‌ర‌చూ సాగుతూ ఉంది. రెండు వేల రూపాయ‌ల నోటు త్వ‌ర‌లో ర‌ద్దుకాబోతోందంటూ చాన్నాళ్లుగా ప్ర‌చారం సాగుతూ ఉంది.

ఇది వ‌ర‌కూ ప‌లు సార్లు ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది. రెండు వేల రూపాయ‌ల నోటు ఈ మ‌ధ్య‌కాలంలో ఏటీఎంల‌లో ల‌భ్య‌త కూడా త‌క్కువ‌గా ఉంది. ఆ నోటు ముద్ర‌ణ‌ను ఆపేసిన‌ట్టుగా ఇది వ‌ర‌కే కేంద్రం ప్ర‌క‌టించింది. అస‌లే క‌రెన్సీ.. ఈ నేప‌థ్యంలో దాని గురించి రూమ‌ర్లు, సందేహాలు కూడా చాలా త్వ‌ర‌గా వ్యాపిస్తాయి క‌దా. అలాంటి సందేహ‌మే ఎంపీల‌కు కూడా వ‌చ్చింది. ఆ విష‌యాన్ని లోక్ స‌భ‌లో ప్ర‌స్తావించారు.

ఇంత‌కీ రెండు వేల రూపాయ‌ల నోటు ఉంటుందా? ర‌ద్ద‌వుతుందా? అంటూ వారు కేంద్రాన్ని అడిగారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రెండు వేల రూపాయ‌ల నోటును ర‌ద్దు చేసే ఉద్ధేశం కేంద్రానికి లేదంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. అది మార‌కంలో ఉంద‌ని, చెల్లుతుంద‌ని చెప్పారు.